ఏపీ రాజకీయాల్లో దత్తపుత్రుడు అనే పేరు చెప్పగానే గుర్తొచ్చే వ్యక్తి పవన్ కల్యాణ్. ఈ నటుడు కమ్ పొలిటీషియన్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడిగా అభివర్ణిస్తుంటారు వైసీపీ నేతలు. దీనికి పవన్ కూడా సీరియస్ గానే కౌంటర్లు వేస్తుంటారు. సీబీఐ దత్తపుత్రుడు, చంచల్ గూడ పుత్రుడు అనాల్సి వస్తుందంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పుడీ ఎపిసోడ్ ను కొత్త మలుపు తిప్పారు మంత్రి అంబటి రాంబాబు. త్వరలోనే దత్తపుత్రుడు టైటిల్ తో సినిమా తీస్తామంటున్నారు మంత్రి. అయితే సీరియస్ గా కాదు, సరదాగానే ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ పై వరుసపెట్టి పంచ్ లు వేశారు.
“స్క్రీన్ ప్లేతో పాటు సెటైర్లు కూడా రాయడం వచ్చంటున్నారు పవన్. సెటైర్లు రాయండి, వేయండి. మీకు స్క్రీన్ ప్లేనే వచ్చు. కానీ మాకు సినిమాలు తీయడం కూడా వచ్చు. దత్తపుత్రుడు టైటిల్ తో సినిమా తీద్దాం అనుకుంటున్నాం. నిర్మాత కోసం ఎదురుచూస్తున్నాం. నారా వారి దత్తపుత్రుడు లేదా బాబు గారి దత్తపుత్రుడు టైటిల్ తో సినిమా అనుకుంటున్నాం. కాకపోతే ఒకటే సమస్య. ఈ సినిమాకు ఒక హీరోయిన్ చాలదు. ఐదుగురు కావాలి. కాబట్టి నిర్మాత దొరకడం కష్టంగా ఉంది.”
ఇలా పవన్ కల్యాణ్ పై వ్యంగ్య బాణాలు వేశారు మినిస్టర్ అంబటి. కేవలం పారితోషికంతో తను బతుకుతున్నానంటూ బీద అరుపులు అరుస్తున్న పవన్.. తన రెమ్యూనరేషన్ ఎంతో బయటపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. పారితోషికం కాకుండా, చంద్రబాబు నుంచి ప్యాకేజీ కూడా అందుకుంటున్న పవన్.. బీద అరుపులు మానేయాలని సూచించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని ఆరోపించారు అంబటి రాంబాబు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం కష్టపడుతుంటే.. చంద్రబాబును సీఎం ను చేయడం కోసం పవన్ కల్యాణ్ కష్టపడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.