పిఠాపురంలో ప‌వ‌న్‌ చిచ్చు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయ అవ‌గాహ‌న త‌క్కువ‌. అయితే త‌న‌కు ఎక్కువ తెలుసు అనుకుని ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. బ‌హిరంగంగా మాట్లాడ‌ని విష‌యాల్ని కూడా య‌థేచ్ఛ‌గా వెల్ల‌డిస్తుంటారు. ఒక్కోసారి ప‌వ‌న్‌తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాంరా దేవుడా అని…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయ అవ‌గాహ‌న త‌క్కువ‌. అయితే త‌న‌కు ఎక్కువ తెలుసు అనుకుని ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. బ‌హిరంగంగా మాట్లాడ‌ని విష‌యాల్ని కూడా య‌థేచ్ఛ‌గా వెల్ల‌డిస్తుంటారు. ఒక్కోసారి ప‌వ‌న్‌తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాంరా దేవుడా అని టీడీపీ నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంటారు.

తాజాగా పిఠాపురంపై ఆయ‌న కామెంట్స్ వివాదాస్ప‌దంగా మారాయి. త‌న‌ను ఎంపీగా పోటీ చేయాల‌ని మోదీ, అమిత్‌షా కోరార‌ని చెప్పారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని వారితో చెప్పాన‌న్నారు. ఒక‌వేళ మ‌ళ్లీ వాళ్లిద్ద‌రూ త‌న‌ను ఎంపీగా పోటీ చేయాల‌ని కోరితే… త‌ప్ప‌కుండా ఆ ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అప్పుడు కాకినాడ నుంచి తాను ఎంపీగా, ఆ స్థానం నుంచి పోటీ చేసే ఉద‌య్ పిఠాపురం నుంచి బ‌రిలో దిగుతామ‌ని తేల్చి చెప్పారు. కాకినాడ‌, పిఠాపురం అభ్య‌ర్థులు అటూఇటూ మారుతార‌ని చాలా తేలిగ్గా చెప్పారాయ‌న‌.

ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య‌. పిఠాపురం నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేస్తారంటేనే అక్క‌డి టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేదు. ప‌వ‌న్ పోటీ చేస్తార‌ని, స‌హ‌క‌రించాల‌ని వ‌ర్మ‌కు చంద్ర‌బాబు న‌చ్చ‌చెబితే, అతి క‌ష్ట‌మ్మీద ఆయ‌న ఓకే అన్నారు. వ‌ర్మ త‌ల ఊపినా, టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప‌వ‌న్‌కు మ‌న‌స్ఫూర్తిగా చేస్తార‌నే న‌మ్మ‌కం లేదు. ఈ నేప‌థ్యంలో పిఠాపురంలో జ‌న‌సేన త‌ర‌పున ఉద‌య్ కూడా పోటీ చేసే అవ‌కాశం వుంద‌నే మాట‌లు టీడీపీ శ్రేణుల‌కు కోపం తెప్పిస్తాయి.

పొత్తు పేరుతో ఉద‌య్‌కి వ‌ర్మ మ‌ద్ద‌తు ఇచ్చే ప్ర‌సక్తే వుండ‌ద‌ని టీడీపీ శ్రేణులు హెచ్చ‌రిస్తున్నాయి. ఒక‌వేళ ప‌వ‌న్ అన్న‌ట్టుగా కాకినాడ నుంచి ఉద‌య్ త‌ప్పుకుని, పిఠాపురానికి వ‌స్తే, వ‌ర్మ స‌హ‌క‌రించ‌డం ప‌క్క‌న పెడితే, ఇండిపెండెంట్‌గా బ‌రిలో దిగుతార‌నే చ‌ర్చ మొద‌లైంది.

ఒక పార్టీకి అధ్య‌క్షుడై వుండి, ఊహాజ‌నిత అంశాల‌ను బ‌హిరంగంగా మాట్లాడ్డంపై టీడీపీ అస‌హ‌నంగా వుంది. అన‌వ‌స‌రంగా కొత్త స‌మ‌స్య‌ల్ని సృష్టించేలా ప‌వ‌న్ కామెంట్స్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే సాకుగా తీసుకుని వ‌ర్మ రివ‌ర్స్ అయితే, స‌ర్దుబాటు ఎవ‌రు చేస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.