త్వరలో వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. గతంలో నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను వైఎస్ జగన్ విడుదల చేశారు. తాజాగా జగన్ చెప్పాడంటే, చేస్తాడంతే నినాదంతో మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం చేయాలని ఆ పార్టీ పక్కా వ్యూహాన్ని రచించింది. మేనిఫెస్టోకు సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే వర్గాలపై జగన్ దృష్టి సారించారు. ప్రధానంగా రైతులు, మహిళలకు ఎక్కువ ప్రయోజనం కలిగించేందుకు ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో మహిళలకు విడతల వారీగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల సందర్భంలో జగన్ రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలను కలిపారు. ఆ తర్వాత ఇచ్చిన హామీ కంటే మరో వెయ్యి పెంచి ఇస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు.
ప్రస్తుతానికి వస్తే… కనీసం లక్ష రూపాయలైనా రైతులకు రుణమాఫీ చేయాలని అధికార పార్టీ అభ్యర్థుల నుంచి జగన్పై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. ఆ దిశగా అడుగులు వేసేందుకు బ్యాంక్ అధికారులు, ఆర్థిక నిపుణులతో జగన్ పలు దఫాలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దఫా ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో, మరోసారి అధికారంలోకి రావాలంటే రైతు రుణమాఫీ తప్పదని జగన్కు పదేపదే చెబుతున్నారని తెలిసింది.
చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని, ఎందుకంటే ఎన్నికల హామీలను ఆయన అమలు చేయలేదనే మాట బలంగా వినిపిస్తోంది. ఇదే జగన్ ఒక్క మాట చెబితే, ఆయనంటే గిట్టని వాళ్లు సైతం నమ్ముతారు. ఆ విశ్వసనీయతే జగన్కు రాజకీయంగా కలిసొచ్చింది. అందుకే ఇతర పథకాల్లో ఏదో ఒకటి తొలగించైనా, రైతు రుణమాఫీకి చోటు కల్పించాలనేది వైసీపీ అభ్యర్థుల అభిప్రాయం. ఫలానా వాళ్లు చెబితే జగన్ వింటారని తెలుసుకుని, ఫోన్ చేసి లేదా నేరుగా కలిసి రైతు రుణమాఫీకి మేనిఫెస్టోలో చోటు కల్పించాలని మరీమరీ వేడుకుంటున్నారు. ఏమవుతుందో చూడాలి.