కాషాయ కలలు నెరవేరడం నిజమేనా?

‘తెలంగాణలో ఈసారి మేం అధికారంలోకి రాబోతున్నాం.. గోల్కొండ కోట మీద కాషాయ పతాక రెపరెపలాడుతుంది’ అని డంకా భజాయించి చెప్పిన రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ వారి అంచనా 30 సీట్లు సాధించగలం అనేది…

‘తెలంగాణలో ఈసారి మేం అధికారంలోకి రాబోతున్నాం.. గోల్కొండ కోట మీద కాషాయ పతాక రెపరెపలాడుతుంది’ అని డంకా భజాయించి చెప్పిన రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ వారి అంచనా 30 సీట్లు సాధించగలం అనేది మాత్రమే. 

కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ద్వారా 30 సీట్లలో కమలదళం గెలిచే అవకాశం ఉన్నదని అంచనాలు వేసుకున్న భారతీయ జనతా పార్టీ హై కమాండ్, వ్యూహాత్మకంగా ‘తాము అధికారంలోకి రాబోతున్నాం’ అనే డాంబికపు ప్రచారాన్ని మొదలుపెట్టింది. 

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో అటువంటి మైండ్ గేమ్ ఆడటం ద్వారా మిగిలిన 89 నియోజకవర్గాలలో కనీసం 20 స్థానాలను తమకు అనుకూలంగా మార్చుకోగలం అనేది అప్పటి వారి వ్యూహం. అదే జరిగి 50 సీట్లు నెగ్గ గలిగితే గనుక ఇతర పార్టీలను చీల్చి అయినా సరే అధికారంలోకి రాగలం అనేది అప్పటి వారి విశ్వాసం.

కానీ తెలంగాణలో ఇప్పుడు రోజులు మారాయి కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితులలో పూర్తిగా మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహం పుంజుకుంటున్నదని ఏక వాక్యంతో అంటే సరిపోదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ తమ హవాను ఎన్నికల దిశగా ప్రజలలోకి నిరూపించుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు అయిన ముఠా తగాదాలు ఇప్పుడు కనిపించకపోవడం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం. 

ఇన్నాళ్లూ ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకున్న నాయకులు కూడా, ఇప్పుడు సఖ్యతతో మెలుగుతున్నారు. బెంగుళూరు మాదిరిగా ఐక్యతతో ఉంటే మాత్రమే అధికారంలోకి రాగలమని వారు నమ్ముతున్నారు!

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతోంది అనే వాదన రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. కొత్తగా ఉన్న పార్టీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లాలని చూస్తున్న వారందరూ కూడా కాంగ్రెస్ వైపే దృష్టి నిలుపుతున్నారు. 

కమల నాయకులలో కూడా కొందరు కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర సారథ్యం కొత్తగా స్వీకరించిన కిషన్ రెడ్డికి పార్టీలో ప్రస్తుతం మిగిలి ఉన్న నాయకులు అందరిని ఒప్పించడం, ఒక్కదాటి మీదకు తీసుకురావడం అనేది అంత సులభమైన సంగతి కాదు. ఈ క్లిష్ట సమయాలను రాష్ట్ర సారధి కిషన్ రెడ్డి ఎలా అధిగమిస్తారో .. అధికార పీఠం మీదికి భారతీయ జనతా పార్టీని అసలు తీసుకు రాగలరో లేదో వేచి చూడాలి!!