దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో శతృత్వం ప్రమాదకరం, అయితే మితృత్వం మరింత ప్రమాదకరం! ఇది ఎన్డీయేలోని ఒక పార్టీ పరిస్థితిని అనుసరించి వినిపిస్తున్న మాట కాదు, తనతో దశాబ్దాలుగా దోస్తీ చేస్తున్న పార్టీలను కూడా నిలువునా చీల్చి పాతరేయడానికి బీజేపీ వెనుకాడటం లేదు! అవకాశవాదం కొద్దీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీలను కమలం పార్టీ ఆ తర్వాత ఏం చేస్తుందనేది అంచనాలకు అందని అంశంగా మారింది.
ఇప్పుడు కర్ణాటకలోని బీజేపీ కొత్త మిత్రపక్షం కూడా గగ్గోలు పెడుతూ ఉంది. అదే జేడీఎస్. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఝలక్ దృష్ట్యా అక్కడ బీజేపీ-జేడీఎస్ లు పొత్తు ప్రకటన చేశాయి! ఇంకేముంది.. జేడీఎస్ కు మళ్లీ ఆయువు లభించినట్టే అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ లీలలు కుమారస్వామికి చుక్కలు చూపుతున్నాయి!
పొత్తు అనుకున్న రోజుల్లో.. కనీసం ఆరేడు సీట్లు అడగాలని కుమారస్వామి అనుకున్నారట. ఆరేడు మొదలుపెడితే కనీసం నాలుగు సీట్లకు అయినా బేరం తెగుతుందనుకున్నారట! అయితే ఇప్పుడు జేడీఎస్ కు బీజేపీ ఆఫర్ రెండంటే రెండు ఎంపీ సీట్లట! కనీసం మూడు అని అడుగుతున్నా కుదరదు అంటున్నారట, రెండింటితో సరిపెట్టుకొమ్మన్నారట!
పాత మైసూరు రాష్ట్రం పరిధిలో జేడీఎస్ కు ఎప్పుడూ అనుకూలత ఉంటుంది. కనీసం 40 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జేడీఎస్ కు చెప్పుకోదగిన పట్టుంది. వంద అసెంబ్లీ సీట్లలో చెప్పుకోదగిన నాయకత్వం ఉంది! గత ఎన్నికల్లోనే జేడీఎస్ బాగా దెబ్బతింది. గత ఎన్నికల్లో జేడీఎస్ కు హీనపక్షంగా 19 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అంతకు ముందు ఎన్నికల్లో ఈ సంఖ్య 40 వరకూ ఉండింది! ఎలా చూసినా.. జేడీఎస్ స్థాయికి రెండుకు మించి ఎంపీ సీట్లను ఇచ్చేలా లేదట కమలం పార్టీ!
మండ్యా, హాసన్.. ఈ రెండు ఎంపీ సీట్లూ జేడీఎస్ కు ఎప్పుడూ ఆయువు పట్టు! గత లోక్ సభ ఎన్నికల్లో మండ్యా లో కుమారస్వామి తనయుడు పోటీ చేసి ఓటమి పాలవ్వడం ఆ పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బ! ఈ రెండు సీట్లలో జేడీఎస్ ఆడుతూ పాడుతూ నెగ్గేది గతంలో! మరి ఇప్పుడు బీజేపీ పొత్తు పేరుతో.. రాష్ట్రంలో ఎక్కడా పోటీకి కూడా చాన్సివ్వకుండా మండ్యా, హాసన్..లు ఇస్తే జేడీఎస్ ది ఒక విషాదభరితమైన పొత్తు కథ అవుతుంది!
రెండు సీట్లు తీసుకుని దాన్ని పొత్తు అని ఎలా చెప్పుకోవాలంటూ కుమారస్వామి వాపోతున్నారట! అలాగే ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీలకు అంటూ కర్ణాటకలోని రెండు ప్రాంతాలకు వస్తే.. జేడీఎస్ కు కనీస సమాచారం కానీ, ఆహ్వానం కానీ లేదట! పొత్తు పేరుతో పిలిచి బీజేపీ తమను పాతరేసినంత పని చేస్తోందంటూ ఇప్పుడు కుమారస్వామి బాహాటంగానే తన పార్టీ వాళ్ల వాపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి! ఇదీ బీజేపీతో పొత్తుల పరిస్థితి!