వాలంటీర్లు వచ్చి వివరాలు అడిగితే ఇవ్వవద్దు అని పవన్ కల్యాణ్ ప్రజలకు ఉద్బోధిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ మీద కోర్టుకు వెళతానని కూడా ఆయన భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
వాలంటీర్ల విషయంలో అసహ్యకరమైన నోటిదూకుడుతో మాట్లాడినదే కాకుండా, రెండున్నర లక్షల వాలంటీర్ల కుటుంబాలకు క్షమాపణ చెబితే సరిపోయేదానికి పవన్ కల్యాణ్ అహంకారానికి వెళ్లి దీనిని రాచపుండుగా మారుస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థలో దుర్మార్గాలు జరుగుతున్నాయని, వారు సేకరిస్తున్న డేటా అంతా చౌర్యానికి గురవుతోందని పవన్ నోటికి తోచినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ మాట్లాడుతున్న మాటల్లోనే బోలెడన్ని కాంట్రడిక్షన్స్ మనకు కనిపిస్తాయి. నిజానికి అలా పరస్పర విరుద్ధమైన మాటలను తలాతోకా లేకుండా మాట్లాడడం అనేది పవన్ కల్యాణ్ కి ఉన్న ప్రాథమిక లక్షణం. ఆయన ఒకవైపు వాలంటీర్లు వచ్చి అడుగుతున్న డేటాను ప్రజలు ఎవ్వరూ వారికి ఇవ్వవద్దు అని హెచ్చరిస్తారు.
ఆడబిడ్డలు ఉన్న కుటుంబాల వారు డేటా ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బెదిరిస్తారు. అసలు వాలంటీర్లను ఇళ్లకే రానివ్వవద్దని కూడా ఆయన తప్పుడు సంకేతాలు ఇస్తారు. తన మాటల ద్వారా.. క్షేత్రస్థాయిలో ఇంటివద్దకే సంక్షేమం అందేలా జగన్ సర్కారు తీసుకువచ్చిన ఒక మంచి ఏర్పాటును సమూలంగా భ్రష్టుపట్టించడానికి ఆయన డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది.
‘‘డేటా ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటే కుదరదు. సంక్షేమ పథకాలు పొందడం అనేది పౌరునిగా ప్రాథమిక హక్కు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కచ్చితంగా సంక్షేమం అందించాల్సిందే’’ అనేది జగన్ మాట. ‘నా ప్రాథమిక హక్కు’ అనే ముసుగులో వివరాలేమీ చెప్పకుండా దాచుకుంటే, వారి అర్హతలను ప్రభుత్వం బేరీజు వేయడం ఎలాగ? ప్రజల, వారి కుటుంబాల వివరాలు లేకుండానే.. పథకాలకు అర్హులో కాదో తెలుసుకోవడానికి పవన్ వద్ద తావీదు మహిమ ఏమైనా ఉన్నదా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉదయిస్తున్నాయి.
వాలంటీర్ల డేటా సేకరణ అంశంపై కోర్టుకు వెళతాం అని పవన్ అంటున్నారు. ఈ విషయంలో బలమైన న్యాయపోరాటం చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. అసలు ఏ పాయింట్ మీద ప్రజల వివరాలు సేకరించకూడదని అంటున్నారో మాత్రం ఆయనకే తెలియదు.
నిజానికి, పవన్ ఎంత త్వరగా కోర్టును ఆశ్రయిస్తే అంత మంచిది అని వాలంటీర్లు, వైసీపీ వారు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే.. కోర్టులో సవివరమైన వాదప్రతివాదాలు జరిగినప్పుడే.. పవన్ కల్యాణ్ మాటల్లో ఎంత అజ్ఞానం తొణికిసలాడుతున్నదో రాష్ట్రప్రజలందరికీ అర్థమవుతుంది.. అని ప్రజలు అనుకుంటున్నారు.