వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్ మీద బురద చల్లడానికే ప్రత్యేకంగా నియమితులైన ఉద్యోగిలాగా.. ఎడాపెడా చెలరేగిపోతున్న సంగతి అందూ గమనిస్తున్నదే. గత ఎన్నికల తర్వాత అన్నయ్యతో విభేదించి.. పూర్తిగా దూరం ఉండిపోయిన షర్మిల, కొన్ని నెలలుగా.. తిరిగి ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి జగన్ పతనమే తన లక్ష్యం అన్నట్టుగా చెలరేగిపోతున్నారు.
ఇదిలా ఉండగా… జగన్ వ్యూహంలో భాగంగానే, షర్మిల కాంగ్రెసు పార్టీ పగ్గాలు తీసుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో విమర్శలుచేయడం ఏపీ రాజకీయాలలో తాజా కామెడీగా గుర్తింపుపొందింది. అయితే ఈ కామెడీకి షర్మిల కూడా ఘాటైన కౌంటరు ఇచ్చారు.
చిలకలూరిపేట సభలో నరేంద్రమోడీ మాట్లాడుతూ ఏపీలో జగన్ పార్టీ- కాంగ్రెసు పార్టీ వేర్వేరు కాదని అన్నారు. ఆ రెండూ ఒకే లక్ష్యం కోసం కలిసే పనిచేస్తున్నాయని ఆయన అభివర్ణించారు. జగన్ పాలన పట్ల ఇష్టం లేని ప్రజల ఓట్లను కాంగ్రెసుకు వేయించడానికే షర్మిల ఆ పార్టీ చీఫ్ గా పనిచేస్తున్నారని కూడా ఆరోపించారు.
అయినా మోడీ మహరాజ్ అంత కామెడీగా ఎలా ఆలోచించారా? అని తెలుగు ప్రజలు విస్తుపోతున్నారు. ఇంతకూ ఏపీ రాజకీయాల గురించి మోడీకి ఫీడ్ బ్యాక్ ఇన్ పుట్స్ ఇచ్చిన కమల మేధావులు ఎవరా అని కూడా వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో సొంత పార్టీని నడుపుతున్న రోజుల్లోనే ఏపీ కి సంబంధించి జగన్ ప్రస్తావన వస్తే.. తీవ్ర విమర్శలే చేస్తూ వచ్చారు.
ఏపీసీసీ చీఫ్ అయ్యాక ఆ డోసేజీ బాగా పెరిగింది. చాలా దారుణమైన విమర్శలు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. వైఎస్సార్ ను అభిమానించే వారు కూడా ఆయన కూతురును అసహ్యించుకునే రీతిలో ఆమె విమర్శలు కొన్ని శృతిమించుతున్నాయి. చంద్రబాబునాయుడుతో ప్యాకేజీ మాట్లాడుకుని, ఆయన మళ్లీ సీఎం కావడానికి ఉపయోగపడేలా షర్మిల రాజకీయం ఉన్నదినే విమర్శలూ ఉన్నాయి. ఇదిలా ఉండగా మోడీ మాత్రం ఇంత చిత్రమైన ఆరోపణలు చేశారు.
అయితే.. షర్మిల మాత్రం మోడీకి చాలా ఘాటైన కౌంటర్లు ఇవ్వడం ఇక్కడ గమనార్హం. అయిదేళ్ల పాటూ పార్లమెంటులో మీరు తలచిన ప్రజావ్యతిరేక బిల్లులన్నీ నెగ్గడానికి జగన్ సాయం తీసుకుంటూ లోపాయికారీ ఒప్పందాలతో వ్యవహరించింది మీరుకాదా.. అంటూ షర్మిల కౌంటర్లు ఇచ్చారు. ఆయన మద్దతు తీసుకున్న మీరు ఇప్పుడు కాంగ్రెస్ – వైసీపీ ఒకే జట్టు అంటారా అంటూ విరుచుకుపడ్డారు. మరి షర్మిల కౌంటర్లకు బిజెపి దళాలు ఏం సమాధానం చెబుతాయో వేచిచూడాలి.