బండారుకు ఇంకా ఆశలు ఉన్నాయా?

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సీటు మీద ఇంకా ఆశలు ఉన్నాయా చంద్రబాబు ఆ సీటుని ఆయనకు ఇస్తారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బండారు…

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సీటు మీద ఇంకా ఆశలు ఉన్నాయా చంద్రబాబు ఆ సీటుని ఆయనకు ఇస్తారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బండారు అయితే పూర్తి మనస్తాపంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ఆయన ఫోన్ లో కూడా ఎవరికీ అందుబాటులో లేకుండా ఉన్నారని అంటున్నారు. ఆయన నివాసం వద్దకు చేరి అభిమానులు అనుచరులు టికెట్ ని బండారుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా తాజాగా రోడ్ల మీదకు వచ్చి బండారుకు టికెట్ ఇవ్వాలని నిరసన తెలియచేశారు.

పెందుర్తి సీటుని జనసేనకు ఇచ్చేశారు అని అంటున్నారు. ప్రకటన ఒక్కటే తరువాయి. అక్కడ పవన్ కి అత్యంత ఆప్తుడు అయిన పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ ఖరారు అయింది. ఇపుడు ఆ సీటుని వదులుకోరు అని అంటున్నారు. అయితే బండారు కూడా పార్టీలో శక్తిమంతుడే అని అంటున్నారు.

ఆయన వియ్యంకుడు అచ్చెన్నాయుడు, అల్లుడు రామ్మోహన్ నాయుడుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంతం నెగ్గినపుడు పెందుర్తిలో బండారు పట్టుదల ఎందుకు నెగ్గదని ఆయన అనుచరులు అంటున్నారు.

పార్టీలో మొదటి నుంచి ఉన్న జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ని నిడదవోలుకు పంపించారు. విశాఖలో పంచకర్ల ఈ మధ్యనే జనసేనలో చేరారు, సీనియర్ నేత కోసం ఆయనకు వేరే చోటు చూపించలేరా అన్నది బండారుకు మద్దతు ఇస్తున్న వారి మాటగా ఉంది. బండారు పుట్టి పెరిగిన సొంత ప్రాంతం నుంచి ఆయనకు పోటీ చేసే చాన్స్ ఇవ్వరా అని అంటున్నారు. బండారు విషయంలో అధినాయకుడు ఎలా నిర్ణయిస్తారో చూడాలని అంటున్నారు.