అప్పటిదాకా చిన్నమ్మకు మాట్లాడే అర్హత లేదు!

చిన్నమ్మగా ఎరిగిన వారు ప్రేమగా పిలుచుకునే దగ్గుబాటి పురందేశ్వరి.. ఏపీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారథిగా పగ్గాలు స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటించిన చాలారోజుల పాటు ఢిల్లీలోనే తిష్ఠవేసి, మంచి ముహూర్తం చూసుకుని…

చిన్నమ్మగా ఎరిగిన వారు ప్రేమగా పిలుచుకునే దగ్గుబాటి పురందేశ్వరి.. ఏపీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారథిగా పగ్గాలు స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటించిన చాలారోజుల పాటు ఢిల్లీలోనే తిష్ఠవేసి, మంచి ముహూర్తం చూసుకుని మరీ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి.. ఈ వ్యవధిలో.. తన రాజకీయ గమనం, సారథ్యం ఏ దిశగా ఉండాలో చాలా గట్టిగానే హోంవర్క్ చేసినట్టుగా ఉన్నారు. పగ్గాలు అందీఅందగానే.. జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిపోయారు.

చిన్నమ్మ మాటలనుంచి కొత్తదనం కోరుకోవడం అనేది కుందేటి కొమ్ము వెతికినట్లే అవుతుంది. ఈ నాలుగేళ్లుగా బిజెపి నాయకులు, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే తెలుగుదేశం, జనసేన నాయకులు జమిలిగా చేస్తున్న విమర్శలనే చిన్నమ్మ మరోసారి వినిపించారు. జగన్ ను ఇతరులు తిట్టిపోసిన అన్ని ప్రసంగాల స్క్రిప్టులను కలిపి మిక్సీలో వేసి.. తాను ఒకటి వండి వార్చారేమో అని జనం నవ్వుకునేలా ఆమె ప్రసంగం సాగిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చాలా చాలా ఒరగబెట్టేస్తున్నట్టుగా చిన్నబిల్డప్ ఇవ్వడం ఈ సందర్భంగా గమనార్హం. కిసాన్ నిధికింద డబ్బులిస్తున్నామని, డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయని, తొమ్మిదేళ్లలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 20 వేల కోట్లు ఇచ్చిందని ఇలా రకరకాల మాటలు చెప్పారు. 

అయితే చిన్నమ్మ ఒక సంగతి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలతో పాటు అందరికీ ఇచ్చినట్టుగానే ఏపీకి కూడా ఇచ్చారా.. లేదా ఏపీ మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఒలకబోస్తూ ఏమైనా ఇచ్చారా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.

అయినా, కొత్త సారథిని నియమించినంత మాత్రాన.. ఏపీలో బిజెపి లేచి నిలబడుతుందని హైకమాండ్ అనుకుంటే వారి భ్రమ. ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి కేంద్రం చేసిన ద్రోహాన్ని, బిజెపి సర్కారు నయవంచనను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. 

చిన్నమ్మ తనకు పదవి దక్కిందని మురిసిపోవడం, చాన్సు దొరికింది కదాని జగన్ ను తిట్టిపోయడం కాదు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి తాను ఏం చేయగలదో ఆలోచించాలి. రాష్ట్రప్రజలకు ఈ విషయంలో ఆమె జవాబు చెప్పాలి. ఆ మాట చెప్పలేనప్పుడు.. ప్రత్యేక హోదా సంగతి తేల్చలేనప్పుడు.. తనకు ప్రజల ఎదుట మాట్లాడే అర్హత లేదని ఆమె తెలుసుకోవాలి.