ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది ఫిక్స్ అయిపోయిన తరువాత కూడా రెండు నెలలు సమయం మిగిలింది ఎన్నికలకు. ఇలా ఇంత సమయం దొరకడం కాస్త అరుదైన విషయమే. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న టాక్, ఏప్రిల్ లోనే ఎన్నికలు వుంటాయన్న ఆలోచన అన్నీ కలిసి, రాజకీయ పార్టీలను ఎన్నికలకు సన్నద్దం చేసాయి. కానీ ఇప్పుడు చూస్తే అరవై రోజులు గ్యాప్ దొరికింది.
ఇది ఎవరికి లాభం? అరవై రోజుల సమయం వుంది కనుక పార్టీల అధినేతలు మరింత ఎక్కువగా ప్రచారం చేసుకోవచ్చు. ఆ లాభం కామన్. ఏ పార్టీ నాయకులైనా సరే, ఉపయోగించుకోగలిగితే ఈ సమయం మంచి అవకాశం. ఏ పాకెట్ల్లో సమస్యలు వున్నాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే వ్యవహారాలు అన్నీ పక్కాగా చక్కబెట్టుకోవచ్చు. అసంతృప్తి వాదులను బుజ్జగించుకోవచ్చు.
ముఖ్యంగా ఏ ఎన్నికలైనా, ఏ పార్టీ అయినా అభ్యర్థుల జాబితా వచ్చిన వెంటనే కాస్త అలజడులు కామన్ గా వుంటాయి. రెండు రోజులు ఆగిన తరువాత మెత్తబడడం మొదలవుతుంది. అధినేతలు ఫోన్ చేస్తే చాలు, ఏదో హామీ ఇస్తే చాలు అనే పరిస్థితికి వస్తారు. అలాంటపుడు ఓక్క. మాట చాలు అంతా సర్దు కుంటుంది. ఇలాంటి వాటి అన్నింటకీ ఇప్పుడు సమయం చిక్కింది.
అలాగే నియోజకవర్గాల స్థాయిలో లోకల్ గా కొన్ని సమస్యలు వుంటాయి. గ్రామాల అలకలు వుంటాయి. సమస్యల కోసం ఎన్నికల బహిష్కరణలు వుంటాయి. ఇవన్నీ సర్దు బాటు చేసుకోవడానికి ఇప్పుడు కావాల్సినంత సమయం వుంది.
ఇవన్నీ ఇలా వుంటే రెండు నెలల పాటు కార్యకర్తలను పోషించాలంటే మామూలు విషయం కాదు. చాలా ఖర్చుతో కూడిన సంగతి. వాహనాలు, మందు, భొజనాలు ఇవన్నీ కలిసి ఖర్చు ఓ లెక్కలో వుంటుంది. ముందుగా అంచనా వేసుకున్న బడ్జెట్ దాదాపు డబుల్ అయిపోతుంది. వెనుక వున్న జనాలను సదా జాగ్రత్తగా చూసుకుంటూ వుంటాలి. ఏమాత్రం తేడా జరిగినా అటు వాళ్లు ఇటు వెళ్లడం, ఇటు వాళ్లు అటు వెళ్లడం మామూలు అవుతుంది.
మొత్తం మీద 60 రోజుల టైమ్ అన్నది చాలా వరకు లాభం.. మరి కొంత వరకు నష్టం.