ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు వేళైంది. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఇదిగో, అదిగో అంటూ ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిసా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను వెల్లడిస్తుంది. ఏపీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఈ దఫా ఏ దశలో ఎన్నికలు ఉంటాయో అనే చర్చకు తెరలేచింది. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు అయిపోతే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ వస్తే వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం వుండదు. రాష్ట్రం మొత్తం ఈసీ పాలనలో వుంటుంది. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకే అధికారులు నడుచుకోవాల్సి వుంటుంది. ఒకవేళ ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే, దానికి ఈసీ అనుమతి పొందాల్సి వుంటుంది.
ఎన్నికల ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ ఎదురు చూడక తప్పదు. అధికారం వైసీపీదా? లేక కూటమిదా? అనేది మే నెలలో తేలనుంది. అంత వరకూ ఉత్కంఠ తప్పదు మరి!