ఇదేం చేరిక బాబూ.. బీజేపీ నేత‌కు కండువానా?

టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఒక కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. అయితే గియితే ఈ కూట‌మి నుంచి వైసీపీలో చేర‌డ‌మో, లేక అధికార పార్టీ నుంచి కూట‌మిలోని పార్టీల్లోకి వ‌ల‌స‌లు ఉండాలి. కానీ ఏపీ రాజ‌కీయాల్లో చిత్ర‌విచిత్రాలు…

టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఒక కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. అయితే గియితే ఈ కూట‌మి నుంచి వైసీపీలో చేర‌డ‌మో, లేక అధికార పార్టీ నుంచి కూట‌మిలోని పార్టీల్లోకి వ‌ల‌స‌లు ఉండాలి. కానీ ఏపీ రాజ‌కీయాల్లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కూట‌మిలోని పార్టీల మ‌ధ్యే వ‌ల‌స‌లు సాగుతున్నాయి.

తాజాగా నంద్యాల జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలు బైరెడ్డి శ‌బ‌రి టీడీపీలో చేరారు. చంద్ర‌బాబు చేతుల మీదుగా ఆమె పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఈమె నంద్యాల పార్ల‌మెంట్ స్థానం ఆశిస్తున్నారు. చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో బీజేపీ కండువా ప‌క్క‌న ప‌డేసి, ప‌సుపు కండువా క‌ప్పుకోవ‌డం విశేషం.

అదేదో బీజేపీకే నంద్యాల లోక్‌స‌భ టికెట్ ఇచ్చి వుంటే స‌రిపోయిది క‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తే నంద్యాల పార్ల‌మెంట్ ప‌రిధిలోని ముస్లిం ఓట్లు ప‌డ‌వ‌నే భ‌యంతో టీడీపీ నీడ‌కు చేరార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇటీవ‌ల భీమ‌వ‌రం టీడీపీ ఇన్‌చార్జ్ పులిప‌ర్తి రామాంజ‌నేయుల్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ జ‌న‌సేన‌లో చేర్చుకుని టికెట్ కూడా ఖ‌రారు చేశారు. ఈ ప‌రిణామాల‌పై జ‌నం న‌వ్వుకుంటున్నారు.

కూట‌మిలోని పార్టీల మ‌ధ్యే కండువాల మార్పు ఎందుక‌ని ప్ర‌జానీకం ప్ర‌శ్నిస్తోంది. రాజ‌కీయ విభేదాల‌తో పార్టీలు మార‌డం చూశాం. కానీ అన్నీ ఒకే కూట‌మిలో వుంటూ, పార్టీలు మారుతున్న విచిత్ర ప‌రిస్థితిని ఏపీలోనే చూస్తున్నామ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.