తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట కవితపై ఈడీ, ఐటీ పంజా విసిరాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత నిందితురాలనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్లోని కవిత ఇంట్లో సోదాలు మొదలు పెట్టడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఉన్నారని తెలుసుకునే ఈడీ, ఐటీ బృందాలు సోదాలు మొదలు పెట్టాయి. కవిత భర్త వ్యాపారాలకు సంబంధించి కూడా సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలా వుండగా కవిత ఇంటికి ఆమె తరపు న్యాయవాదుల బృందం వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ ఈడీ, ఐటీ అధికారులు అనుమతించలేదు. శనివారం సాయంత్రం వరకూ ఈ సోదాలు జరిగే అవకాశం వుందని సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ఒక రోజు ముందు కవిత ఇంట్లో ఈడీ, ఐటీ బృందాలు అకస్మాత్తుగా కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు ముఖ్యులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కవితను ఇప్పటికే పలుమార్లు ఈడీ, సీబీఐ అధికారులు విచారించారు. ఒక దశలో ఆమెను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, ఆచరణకు నోచుకోలేదు.
బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడం వల్లే కవిత అరెస్ట్ జరగలేదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కవిత అరెస్ట్ వ్యవహారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకమైంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దని, తనకెలాంటి సంబంధం లేదంటూ ఆమె న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సోదాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.