ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాదన్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్ ఆదరించారు. సీట్ల ఎపిసోడ్‌లో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అదృష్టజాతకుడని చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. చిత్తూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా విజయానందరెడ్డిని ఎంపిక చేశారు.
దీంతో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి హర్ట్ అయ్యారు. గతంలో పీఆర్పీలో ఉన్నప్పుడు పవన్‌తో స్నేహ సంబంధాల రీత్యా ఇటీవల జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా ఇప్పటికే చిత్తూరు నుంచి టీడీపీ పోటీ చేస్తోంది. గురజాల జగన్‌మోహన్‌రావును అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆరణికి జనసేన ఎక్కడ టికెట్ ఇస్తుందనే చర్చకు తెరలేచింది.
ఇదే సందర్భంలో తిరుపతి సీటును జనసేనకు కేటాయించారు. బలమైన అభ్యర్థి ఆ పార్టీకి అవసరమైంది. కాంట్రాక్టర్ అయిన ఆరణిని తిరుపతి బరిలో నిలిపితే బాగుంటుందని పవన్ నిర్ణయించారు. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని గత రాత్రి ఫైనల్ చేశారు.
నేడో, రేపో తిరుపతి జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల్ని పవన్‌కల్యాణ్ ప్రకటించనున్నారు. జగన్ కాదంటేనేం…జనసేనాని ఆదరించారనే చర్చకు తెరలేచింది