ఎంతకాలం దాచిపెట్టుకుంటావు పవన్?

దాచితే దాగే విషయాలను ఎప్పటికీ దాచిపెట్టాలి. దాచినా దాగని విషయాలను తమంతగా ముందే బయటపెట్టేయాలి.. అనేది ఒక సార్వజనీనమైన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం పవన్ కల్యాణ్ కు తెలియకుండా ఉండదు. అయినా సరే.. ఆయన…

దాచితే దాగే విషయాలను ఎప్పటికీ దాచిపెట్టాలి. దాచినా దాగని విషయాలను తమంతగా ముందే బయటపెట్టేయాలి.. అనేది ఒక సార్వజనీనమైన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం పవన్ కల్యాణ్ కు తెలియకుండా ఉండదు. అయినా సరే.. ఆయన ఇంకా సీక్రెసీ కొనసాగిస్తున్నారు.

జనసేనకు దక్కిన 21 ఎమ్మెల్యే స్థానాల్లో 15 సీట్లను పవన్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశారు. అయినా సరే జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. గోప్యత పాటిస్తున్నారు. తాను పోటీచేసే సీటు గురించి కూడా ఆయన ఎందుకు ఇంత రహస్యం పాటిస్తున్నారో.. కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదు.

పవన్ కల్యాణ్ తొలుత తెలుగుదేశంతో కలిసి, 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అప్పట్లో ఆయన పార్టీకి దక్కిన సీట్లు 24గా ఉండగా.. బిజెపి కూడా పొత్తుల్లోకి వచ్చిన తర్వాత.. ఆ సంఖ్య 21కి తగ్గింది. ఈలోగా పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ జారిపోయే ప్రమాదం పొడసూపడంతో నిడదవోలు నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించేస్తూ ఒక ప్రత్యేక ప్రెస్ నోట్ ఇచ్చేశారు. 

తాజాగా బుధవారం రాత్రి 9 మందికి అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, ఎలమంచిలి- సుందరపు విజయకుమార్, విశాఖ సౌత్- వంశీకృష్ణ యాదవ్, తాడేపల్లి గూడెం- బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం- బొమ్మిడి నాయకర్, భీమవరం- పులపర్తి రామాంజనేయులు, రాజోలు- దేవవరప్రసాద్, తిరుపతి- ఆరణి శ్రీనివాసులు లకు సీట్లను కన్ఫర్మ్ చేశారు.

ఇంకా కేవలం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే మిగిలున్నాయి. అవి ఏవి అనేది ఖరారుగా జాబితా ప్రకటించలేదు గానీ.. రకరకాల అంచనాలు సాగుతున్నాయి. పిఠాపురం, అమలాపురం, రామచంద్రపురం, పాలకొండ, అవనిగడ్డ, రైల్వేకోడూరు, పోలవరం లలో ఆరు జనసేనకు దక్కవచ్చుననే ప్రచారం ఉంది.

ఇంత చివరి దశకు చేరుకుంటున్నా పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీచేస్తారనే సీక్రెట్ మాత్రం ముడివిప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడినుంచి పోటీచేస్తారో అందరికీ క్లారిటీ ఉంది. చంద్రబాబు కూడా కుప్పం నుంచి తన అభ్యర్థిత్వాన్ని తొలిజాబితాలోనే ప్రకటించుకున్నారు. కానీ.. పవన్ మాత్రం తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలో ఇంకా తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు.

తన పేరు ప్రకటిస్తే.. వైసీపీ జాబితా వచ్చేదాకా.. ఈ ఆరు సీట్లను ప్రకటించకుండా.. తన అభ్యర్థిత్వం గురించి సీక్రెసీ కొనసాగిస్తారా అనే అనుమానాలున్నాయి. సీటు ఏదో దాచిపెట్టడం.. ఒక రకమైన భయానికి సంకేతం అని పలువురు అంచనా వేస్తున్నారు.