ఇంకా చేతిలో నాలుగేళ్ల ఎమ్మెల్సీ పదవి ఉండగానే జనసేనలోకి జంప్ చేశారు వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయనకు చట్ట సభలలో అవకాశం ఇవ్వాలనే జగన్ ఎమ్మెల్సీని చేశారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆరేళ్ల పదవీకాలం తో ఎమ్మెల్సీ దక్కింది. మరోసారి వైసీపీ గెలిస్తే మంత్రి పదవికి కూడా చాన్స్ ఉండేది అని అంటున్నారు.
అయితే వంశీ తొందరపడ్డారో లేక విశాఖ ఎంపీ మీద వ్యతిరేకత ఆయనను పురిగొల్పిందో తెలియదు కానీ జనసేనలోకి వెళ్ళిపోయారు. తన ఎమ్మెల్సీ పదవికి ముప్పు లేదు తాను స్థానిక సంస్థల కోటాలో నెగ్గాను అని ఆయన చెబుతూ వచ్చారు. కానీ శాసనమండలి చైర్మన్ ఆయన మీద అనర్హత వేశారు. దాంతో వంశీ మాజీ అయిపోయారు.
ఇపుడు ఆయనకు జనసేన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయించాలి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకే తాను వైసీపీని వీడాను అని ఆయన చెప్పుకున్నారు. ఆయన కోసం భీమిలీ విశాఖ సౌత్ ని జనసేన అడుగుతోందని అంటున్నారు. అయితే భీమిలీని గంటా శ్రీనివాసరావుకు ఇస్తారని అంటున్నారు.
విశాఖ సౌత్ కి టీడీపీ టికెట్ కోసం ఒక బిగ్ షాట్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆయన లోకల్ గా కూడా కీలకంగా ఉన్నారు. ఆయన పేరుని టీడీపీ పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఇక జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు అని మొదట ప్రకటించారు. చివరికి అవి 21కి మారాయి.
అలా మూడు సీట్లు కోత పడ్డాయి. దాంతో విశాఖలో జనసేనకు ఇచ్చే సీట్లు ఎన్ని అన్నది క్లారిటీ రావడంలేదు. ఇప్పటికే అనకాపల్లి సీటుని జనసేనకు ఇచ్చారు. పెందుర్తి, ఎలమంచిలి కచ్చితంగా తీసుకోవాలని జనసేన చూస్తోంది. విశాఖ సౌత్ ని ఆ పార్టీకి ఇస్తే వంశీకి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ పోయింది ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే మాత్రం జంప్ చేసినా ఫలితం ఉండదు అని అంటున్నారు.