హెచ్చ‌రికః జ‌న‌సేన‌కు 21 ఖాయం కాదు!

జ‌న‌సేన సీట్ల‌పై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి. గ‌తంలో టీడీపీతో జ‌న‌సేన‌కు పొత్తు కుద‌ర‌ని రోజుల్లోనే ప‌వ‌న్‌కు ఇచ్చేది 20 సీట్లే అంటూ నియోజ‌క‌వ‌ర్గాల‌తో స‌హా విస్తృతంగా ప్ర‌చార‌మైంది. అప్ప‌ట్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్…

జ‌న‌సేన సీట్ల‌పై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి. గ‌తంలో టీడీపీతో జ‌న‌సేన‌కు పొత్తు కుద‌ర‌ని రోజుల్లోనే ప‌వ‌న్‌కు ఇచ్చేది 20 సీట్లే అంటూ నియోజ‌క‌వ‌ర్గాల‌తో స‌హా విస్తృతంగా ప్ర‌చార‌మైంది. అప్ప‌ట్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగానే ఆ ప్ర‌చారాన్ని ఖండించారు. టీడీపీ వేసే ముష్టి 20 సీట్ల‌ను తీసుకుని, జ‌న‌సైనికుల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెడ‌తానా? అని భారీ డైలాగ్‌లు కొట్టారు. గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు వుంటుంద‌ని చెప్పారు.

నాడు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగిన‌ట్టే చివ‌రికి జ‌న‌సేన‌కు ద‌క్కింది 20 అసెంబ్లీ సీట్లే. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య సీట్ల లెక్క తేలింది. జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ, 2 లోక్‌స‌భ స్థానాలు ద‌క్కాయి. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌స‌భ స్థానాల‌ను టీడీపీ కేటాయించింది. మిగిలిన 144 అసెంబ్లీ, 17 పార్ల‌మెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయ‌నుంది. సాంకేతికంగా జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ స్థానాలు అయిన‌ప్ప‌టికీ, అందులో ఒక నియోజ‌క‌వ‌ర్గం భీమ‌వ‌రం నుంచి టీడీపీ ఇన్‌చార్జ్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ‌దైన రీతిలో నెటిజ‌న్లు సృజ‌నాత్మ‌క సెటైర్స్ విసురుతున్నారు. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

“ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌. జ‌న‌సేన‌కు ఇప్పుడు ప్ర‌క‌టించిన 21 అసెంబ్లీ, 2 లోక్‌స‌భ స్థానాలు కూడా ఖాయ‌మైన‌ట్టు కాదు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల రీత్యా నామినేష‌న్ల చివ‌రి రోజు వ‌ర‌కూ మార్పుచేర్పులు చేయొచ్చు. అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్‌కల్యాణ్ త‌న సీట్ల‌లో కోత విధించుకోడానికి సిద్ధంగా ఉన్నారు. పార్ల‌మెంట్ సీట్లు లేకుండానే, 10 అసెంబ్లీ స్థానాల‌కైనా ఆయ‌న అంగీక‌రించే ప‌రిస్థితి వుంది. జ‌న‌సేన సీట్ల రిమోట్ చంద్ర‌బాబునాయుడు చేతిలో వుంది. బాబు మ‌న‌సులో క‌లిగే ఆలోచ‌న బ‌ట్టి జ‌న‌సేన భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి వుంటుంది. కావున ఇప్పుడు జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ సీట్లు ఫైన‌ల్ అని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు అనుకోకూడ‌దు. భ‌విష్య‌త్‌లో ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా త‌ట్టుకునే గుండె నిబ్బ‌రం వారికి అవ‌స‌రం” అంటూ పోస్టులు వెలుగు చూస్తున్నాయి.

“తాడేప‌ల్లిగూడెం బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు స‌మ‌క్షంలో మ‌న పార్టీకి ఏం బ‌లం వుంది. బూత్ క‌మిటీలు, గ్రామ క‌మిటీలు, మండ‌ల క‌మిటీలు ఏమైనా ఉన్నాయా? మ‌న వాళ్లేమైనా ప‌ది మందికి భోజ‌నం పెట్ట‌గ‌ల‌రా? టీడీపీతో పోల్చుకుంటే మ‌న బ‌లం ఎంత‌? మాట్లాడితే చాలు 24 సీట్లు త‌క్కువ‌ని అంటారు. న‌న్ను ప్ర‌శ్నించే వాళ్ల‌కు ఏం తెలుసు? అని త‌న‌ను తాను కించ‌ప‌ర‌చుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు బాబు త‌గిన శిక్ష విధించారు. ఏమీ లేని పార్టీకి 24 అసెంబ్లీ, 3 పార్ల‌మెంట్ స్థానాల‌ను ఇచ్చి త‌ప్పు చేశాన‌ని చంద్ర‌బాబు ప‌శ్చాత్తాపప‌డ్డాడు. అందుకే సీట్ల‌తో కోత కోసి మ‌రీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్థాయి ఏంటో చంద్ర‌బాబు బాగా బుద్ధి చెప్పారు” అంటూ నెటిజ‌న్లు హిత‌వు చెప్పారు.

“ఈ మాత్రం సీట్ల‌కైతో పోటీ చేయ‌డం ఎందుకు? అదేదో మొత్తం సీట్లు టీడీపీ, బీజేపీల‌కే ఇచ్చి, 2014లో మాదిరిగా బేష‌ర‌తు మ‌ద్ద‌తు ఇచ్చి, ఆ రెండు పార్టీల‌కు ప్ర‌చారం చేయొచ్చు క‌దా? లేదా టీడీపీలోనో, బీజేపీలోనో జ‌న‌సేనను విలీనం చేయొచ్చు క‌దా?” అంటూ ప‌వ‌న్‌పై ఘాటు కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ 24 సీట్ల‌లోనే పోటీ చేయ‌డం వెనుక గాయ‌త్రి మంత్రం వుంద‌ని తాడేప‌ల్లిగూడెం స‌భ‌లో చెప్పావు. ఇప్పుడు 21 సీట్లే తీసుకోవ‌డం వెనుక ఏ మంత్రం ఉందో చెప్ప‌య్యా ద‌త్త‌పుత్రాఈ  అంటూ నెటిజ‌న్లు దెప్పి పొడిచారు. మొత్తానికి నామినేష‌న్లు వేసే వ‌ర‌కూ జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ, 2 లోక్‌స‌భ స్థానాలైనా వుంటాయ‌ని సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా న‌మ్మ‌లేని ప‌రిస్థితి.