పొత్తు కుదిర్చినా త్యాగం చేయక తప్పలేదు

ఏపీలో టీడీపీతో బీజేపీ కలవడం వెనుక చంద్రబాబు కన్నా పవన్‌ కల్యాణే కీలక పాత్ర పోషించారనే మాట వినిపిస్తోంది.టీడీపీని బీజేపీతో కలపడం కోసం ప్రయత్నించి, కాషాయ పార్టీ జాతీయ నాయకత్వంతో చీవాట్లు కూడా తిన్నానని ఆమధ్య…

ఏపీలో టీడీపీతో బీజేపీ కలవడం వెనుక చంద్రబాబు కన్నా పవన్‌ కల్యాణే కీలక పాత్ర పోషించారనే మాట వినిపిస్తోంది.టీడీపీని బీజేపీతో కలపడం కోసం ప్రయత్నించి, కాషాయ పార్టీ జాతీయ నాయకత్వంతో చీవాట్లు కూడా తిన్నానని ఆమధ్య పవన్‌ కల్యాణ్‌ అన్నాడు. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ మొదట్లో సిద్ధంగా లేదని పవన్‌ చెప్పకనే చెప్పాడు. ఒకప్పుడు ఎన్డీయేలో చక్రం తిప్పిన చంద్రబాబుకు, అదే ఎన్డీయేలో రీ ఎంట్రీ కోసం పవన్‌ చక్రం తిప్పాల్సి వచ్చింది. అంటే ఎన్డీయేలో శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి చంద్రబాబు వచ్చారని అర్థమవుతోంది. పవన్ బీజేపీ పెద్దలతో తిట్లు తిని పొత్తు కుదిర్చినా ఏం లాభం? బీజేపీతో పొత్తు కుదిర్చిన ఫలితంగా తాను త్యాగం చేయాల్సి వచ్చింది. 

టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు  గ‌తంలో టీడీపీ, జ‌న‌సేన పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు  చంద్రబాబు. ఇప్పటికే 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించారు జనసేనాని. తాజాగా కూటమిలో చేరిన బీజేపీ 8 ఎంపీ స్థానాలు కోరగా.. బీజేపీ, జనసేనలకు కలిపి 8 ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇందులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు దక్కనున్నాయి. ఇప్పటికే జనసేనకు కేటాయించిన 3 ఎంపీ సీట్లలో ఒక సీటును బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు పవన్‌ను కోరినట్లు స‌మాచారం. అయితే 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసేందుకు సిద్ధపడింది. 

అనకాపల్లి నుంచి నాగబాబు, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి, కాకినాడ నుంచి సానా సతీష్‌కుమార్‌ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ, ఇప్పుడు జనసేన ఓ సీటును బీజేపీకి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జనసేన రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి పరిమితం కానుంది. 

బీజేపీ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా  మిగిలిన 17 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని  సమాచారం. జనసేనాని తీరుపై ఇప్పటికే జనసైనికులు, కాపు సామాజికవర్గం నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కేవలం 24 అసెంబ్లీ సీట్లకే అంగీకరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇక పవన్‌కల్యాణ్‌ను సైతం ఎంపీగా పోటీ చేయాలని అమిత్ షా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏ స్థానం నుంచి పవన్‌ పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. జనసేనకు కేటాయించిన 2 ఎంపీ స్థానాల్లో ఓ స్థానం నుంచి పవన్ పోటీ చేస్తే.. ప్రస్తుతమున్న ఆశావహుల్లో ఎవరిని తప్పిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. 

ఇదిలా ఉంటే, ఆరు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది. అయితే పొత్తుపై టీడీపీ, బీజేపీ భిన్న ప్రకటనలు చేస్తున్నాయి. తనంతట తానే ఎన్డీఏ కూటమిలో చేరడానికి తెలుగుదేశం.. బీజేపీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపినట్లుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెబుతున్నారు. దీనికి పూర్తి భిన్నంగా టీడీపీ చెబుతోంది. బీజేపీ ఆహ్వానించడం వల్లే రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏలో చేరామని టీడీపీ చెబుతోంది. అంటే ఎవరికీ వాళ్ళే బింకంగా ఉన్నారన్న మాట. ఒకటి మాత్రం నిజం. ఎన్డీయే -1 లో చంద్రబాబు శాసించే స్థాయిలో ఉండేవారు. అదే ఎన్డీయే 2.0లో బాబు పరిస్థితి ఏంటి? 

శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి వచ్చారు. చక్రం తిప్పే స్థాయి నుంచి, బీజేపీ పెద్దల అనుగ్రహం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో  చంద్రబాబు, ఢిల్లీ వెళితే…రాజు వెడలె రవితేజములలరగా అన్నట్లు ఉండేది. ఎన్డీయే -1 టైమ్‌లో చంద్రబాబు టైమ్‌ అద్భుతంగా ఉండేది.

1999 నుంచి 2004 వరకు నడిచిన ఎన్డీయే పాలనలో చంద్రబాబు హవా నడిచేది. ఎన్డీయే కన్వీనర్‌గానే కాకుండా కీలక నిర్ణయాల్లో చంద్రబాబు సలహాలు, సూచనలను వాజపేయి తీసుకునేవారని చెబుతారు. అప్పుడు ఎన్డీయేలో డెసిషన్‌ మేకర్‌గా కూడా బాబు ఉండేవారంటారు. ఇక అప్పట్లో రాష్ట్రపతి పదవికి అబ్దుల్‌ కలామ్‌ పేరును ప్రతిపాదించి వాజపేయి, అద్వానీలను ఒప్పించింది తానే అంటారు చంద్రబాబు. 

ఇక వాజపేయి అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కూడా చంద్రబాబు సలహాయే కారణం అని చెబుతారు. అప్పట్లో ఎన్డీయేలో చంద్రబాబు అంతలా చక్రం తిప్పేవారని చెబుతారు. ఎన్డీయేలో ఆనాటి చంద్రబాబు ప్రాభవం, వైభవం ఇప్పుడు మంచులా కరిగిపోయాయి. అప్పట్లో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు వాజ్‌పేయి, అద్వానీ స్వాగతం పలికిన పరిస్థితి ఉంటే, ఇప్పుడు పొత్తుల కోసం ఢిల్లీ బీజేపీ పెద్దల చుట్టూ చంద్రబాబే తిరగాల్సిన స్థితి వచ్చింది. 

ఎంతో కాలం నుంచి బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాటామంతీ కలిపారు. ఆ తర్వాత నెలన్నర క్రితం అమిత్‌ షాతో చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. తాజాగా రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు చంద్రబాబు. అయితే టీడీపీతో బీజేపీ కలవడం వెనుక చంద్రబాబు కన్నా పవన్‌ కల్యాణే కీలక పాత్ర పోషించారని సమాచారం. అంటే బీజేపీ పెద్దల దగ్గర చంద్రబాబు కంటే పవన్ కు ఎక్కువ విలువ ఉందని అనుకోవాలా?