కోలీవుడ్ ను ఓ ఊపు ఊపుతోంది డ్రగ్స్ రాకెట్ కేసు. ఏకంగా ఓ నిర్మాత, 2వేల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆరోపిస్తోంది. ఈ మేరకు అతడ్ని అరెస్ట్ చేసింది కూడా. ఇప్పుడీ వ్యవహారంలోకి నటుడు, రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ పేరు తెరపైకొచ్చింది.
నిజానికి అరెస్ట్ అయిన నిర్మాత జాఫర్ సాదిక్, డీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. అతడు కొన్నాళ్లు డీఎంకేలో పనిచేశాడు. పార్టీకి చెందిన ఎన్నారై సెల్ లో ఆఫీస్ బేరర్ పదవితో పాటు, మరికొన్ని పదవులు కూడా చేపట్టాడు. ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో అతడి పేరు తెరపైకొచ్చిందో, వెంటనే సాదిక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
సాదిక్ ను అరెస్ట్ చేసిన అధికారులు అతడి దగ్గర్నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉదయనిధి స్టాలిన్ పేరు తెరపైకొచ్చినట్టు తెలుస్తోంది.
మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారుల విచారణలో జాఫర్ సాదిక్, ఉయయ్ నిధి స్టాలిన్ పేరును వెల్లడించాడట. అతడికి 7 లక్షల రూపాయలిచ్చాడట. గతేడాది వచ్చిన వరదల సమయంలో ఉదయనిధికి 5 లక్షల రూపాయలిచ్చానని, ఆ తర్వాత పార్టీకి మరో 2 లక్షల రూపాయలిచ్చానని తన విచారణలో వెల్లడించాడట సాదిక్.
ఉదయనిధికి ఇచ్చిన డబ్బును, మాదకద్రవ్యాల లావాదేవీల కింద వచ్చిన సొమ్ము నుంచే తీసి ఇచ్చాడని ఎన్సీబీ ఆరోపిస్తోంది. ఈ మేరకు మంత్రి ఉదయనిధిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు.
ఆహార ఉత్పత్తుల్లో మాదకద్రవ్యాలు దాచిపెట్టి తమ దేశాలకు అక్రమంగా రవాణా అవుతున్నాయని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులు భారత ఏజెన్సీలకు సమాచారం ఇవ్వడంతో ఈ 2వేల కోట్ల రూపాయల రాకెట్ గుట్టు రట్టయింది. నిషేధిత సూడోఎఫెడ్రిన్ ను సాదిక్ విదేశాలకు తరలించాడు.
దీని ద్వారా వచ్చిన డబ్బును అతడు సినిమా నిర్మాణం, రాజకీయాలు, హోటల్స్ వ్యాపారాల్లో పెట్టాడు. మంగై అనే తమిళ సినిమాను పూర్తిగా డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు మరికొంతమంది కోలీవుడ్ ప్రముఖులు, సినీ ఫైనాన్షియర్లను ఎన్సీబీ విచారించనుంది. రాబోయే రోజుల్లో ఈ 2వేల కోట్ల రూపాయల డ్రగ్స్ రాకెట్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.