ఎవరెంతగా గింజుకున్నా జనసేనకు 25 లేదా 30కి లోపు అసెంబ్లీ సీట్లు మాత్రమే చంద్రబాబు ఇస్తారు. ఇప్పటికే ఆ విషయాన్ని పవన్‌కు చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవిపై కూడా పవన్‌కు టీడీపీ క్లారిటీ ఇచ్చింది. అయితే సీట్ల విషయంలో ఎన్ని ఇచ్చినా తనకు బాధ లేదని, కాపు నాయకులను సంతృప్తిపరచడం సవాల్‌గా మారుతోందని చంద్రబాబు ఎదుట పవన్ వాపోయినట్టు తెలిసింది.
ఈ సందర్భంగా కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్యతో పాటు పలువురు తన సామాజిక వర్గం నాయకులు 40 నుంచి 60 వరకు ఎమ్మెల్యే సీట్లు, అలాగే సీఎం పదవిలో వాటా కోరుతున్న విషయాల్ని చంద్రబాబు ఎదుట పవన్ ఉంచారని సమాచారం. 30 లోపు సీట్లే ఇచ్చినా, అలాగే సీఎం పదవిపై క్లారిటీ ఇవ్వకపోయినా కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావనే తన సామాజిక వర్గం నేతల హెచ్చరికలను చంద్రబాబు దృష్టికి జనసేనాని తీసుకెళ్లారు.
చంద్రబాబు ఎదుట సమస్యలన్నీ ఏకరువు పెట్టి, వ్యక్తిగతంగా తన వరకైతే సీట్లు, ఏఏ నియోజకవర్గాలు ఇస్తారనేది సమస్యే కాదని, కాపు నాయకులతోనే ఇబ్బందిగా వుందని చెప్పినట్టు తెలిసింది. ఏం చేద్దామని చంద్రబాబును పవన్ అడిగారనే చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా పవన్‌కు చంద్రబాబు మార్క్ పరిష్కార మార్గం చూపినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎవరైతే కాపు నాయకులు పదేపదే సీట్లు, సీఎం పదవిలో వాటా గురించి మాట్లాడుతున్నారో, అలాంటి వారిని గుర్తించాలని సూచించారు. ముందుగా సమస్యలు సృష్టిస్తారనే అనుమానం వున్న కాపు నేతలందరికీ టికెట్లు ఇస్తే సరిపోతుందని, వాళ్లు నోరు తెరవరని పవన్‌కు చిట్కా చెప్పినట్టు తెలిసింది.
పిల్లోల్లు పాలు కోసం ఏడ్చినట్టు, నాయకులు దేని కోసం అరుస్తారో తనకు తెలుసని, వాళ్ల ఏడుపంతా తమకు టికెట్ కోసమే అని, అరిచే ఐదారుగురు కాపు నాయకులకు ఇచ్చి పడేస్తే జన్మలో ప్రశ్నించరని చంద్రబాబు సలహా ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబు సలహాకు పవన్ ముచ్చటపడ్డారని సమాచారం. కొందరు కాపు నేతలకు టికెట్లు ఇస్తే, ఇక చంద్రబాబుతో ఎలా అంటకాగినా సమస్య లేదని పవన్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.