బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేయడంలో దిట్ట. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ సర్కార్ కూల్చివేతపై ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కరీంనగర్‌లో ఆయన ఆదివారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా రేవంత్‌రెడ్డి సర్కార్ కూలిపోయే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించడం గమనార్హం.
ఇందుకోసం కొందరు కాంగ్రెస్ నేతలే కేసీఆర్‌కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో కొంత మంది కాంగ్రెస్ నేతలకు ఫండింగ్ చేసి, వారిని కోవర్టులుగా కేసీఆర్ మార్చుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ కూలిపోయే సంగతి ఆ పార్టీ నేతలకు తెలియదని, తాము పసిగట్టామని బండి సంజయ్ చెప్పడం చర్చనీయాంశమైంది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం మానుకుని, ముందుగా కేసీఆర్ కుట్రల నుంచి రేవంత్ సర్కార్‌ను కాపాడుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఆయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్న ప్రతిపక్షాల విమర్శల్ని ఆయన కొట్టి పారేశారు. యాదాద్రి పునర్నిర్మాణానికి, ఆయోధ్య రామాలయానికి చాలా తేడా వుందన్నారు. యాదాద్రిలో కేసీఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని విమర్శించారు. అయోధ్యలో ప్రధాని మోదీ సర్కార్ అలా చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి బోటాబోటీ మోజార్టీ రావడంతో రేవంత్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం వుందని మొదటి రోజు నుంచే చర్చ మొదలైంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చిందే బీఆర్ఎస్ నేతలు లెక్కలు చెబుతున్నారు.