తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత భారత రాష్ట్ర సమితి నాయకులు ఏమాత్రం ఓర్వలేకపోతున్నారన్నది నిజం. కాంగ్రెస్ విజయాన్ని, గులాబీ పరాజయాన్ని ఆ పార్టీ శ్రేణులు అందరూ అర్థం చేసుకున్నారు. తాము ఎందుకు ఓడామో గూడా వారికి అవగాహన ఉంది. కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రం సహించలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తాము ఏం చేయగలమో, ఎంత చేయగలమో అంతా చేస్తున్నారు.
తాజాగా హరీష్ రావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం వలన ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని, అందువల్ల ప్రభుత్వం వారికి నెలకు రూ.15వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మనది కాకపోతే కాశీదాకా వెళ్లమని పాత సామెత. హరీష్ రావు చేస్తున్న డిమాండ్ కూడా అదే తరహాలో ఉన్నదని పలువురు భావిస్తున్నారు. పరిపాలన సాగిస్తున్నది తాము కాదు గనుక.. భృతికింద ఎంత పెద్ద మొత్తాలైనా డిమాండ్ చేయగలరని అంతా అంటున్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారట. రేవంత్ సర్కారు వారందరి పొట్ట కొడుతోందట. ఒకరికి మంచి చేస్తూ మరొకరి ఉసురుపోసుకోవడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదట. అందువల్ల ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు ఇవ్వాలనేది హరీష్ రావు డిమాండు.
ఒకసారి కాంగ్రెసు గెలిచి అధికారంలోకి వచ్చినంత మాత్రాన, భారాస నాయకులుగా తాము జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉండిపోతామని హరీష్ రావు అనుకుంటున్నారో ఏమో తెలియదు. ఇవాళ వారు ఎలాంటి డిమాండ్ లనైతే వినిపిస్తున్నారో.. రేపు తాము అధికారంలోకి వస్తే అదే డిమాండ్లను తాము అమలు చేసి తీరాల్సిందేనని కూడా ఆయన భావిస్తున్నట్టు లేదు.
ఎందుకంటే ఆరు లక్షల మంది ఆటోవాలాలకు రూ.15వేల వంతున చెల్లిస్తే ఒక నెలకు 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏడాదికి సుమారుగా 11 వేల కోట్లు అన్నమాట. ఏ ప్రభుత్వానికి అయినా సరే.. ఇది అనూహ్యమైన, అసాధ్యమైన బడ్జెట్. మహిళలకు ఆర్టీసీలో ఉచితం కల్పించడం ద్వారా.. ఏడాదికి ఆర్టీసీకి ప్రభుత్వం మూడువేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందనేది అంచనా.
అసలు పథకానికే అంత ఖర్చవుతుండగా.. దాని ద్వారా ఆటోవాలాలకు రాబడిలో కొంత నష్టపోతున్నందుకు 11 వేల కోట్ల రూపాయలు చెల్లించాలని హరీష్ రావు అనడం తలాతోకా లేని డిమాండ్ లాగా ఉంది. ప్రభుత్వం మనది కాదు కాబట్టి, యిచ్చే బాధ్యత మనకు లేదు కాబట్టి.. నోటికి వచ్చినట్టుగా కాకుండా.. విజ్ఞత ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉన్న హరీష్.. ఆచితూచి డిమాండ్లు వినిపిస్తే బాగుంటుంది.