క‌ల‌వ‌కుండా కుట్ర‌లా… విడిపోతే క‌దా అవ‌న్నీ!

టీడీపీతో క‌ల‌వ‌కుండా ఎన్నో కుట్ర‌లు చేశార‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆరోప‌ణ‌లు విచిత్రంగా ఉన్నాయి. ప‌వ‌న్ కామెంట్స్‌పై నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో సెటైర్స్ విసురుతున్నారు. మంద‌డంలో నిర్వ‌హించిన భోగి మంట‌ల వేడుక‌ల్లో చంద్ర‌బాబుతో క‌లిసి ప‌వ‌న్…

టీడీపీతో క‌ల‌వ‌కుండా ఎన్నో కుట్ర‌లు చేశార‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆరోప‌ణ‌లు విచిత్రంగా ఉన్నాయి. ప‌వ‌న్ కామెంట్స్‌పై నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో సెటైర్స్ విసురుతున్నారు. మంద‌డంలో నిర్వ‌హించిన భోగి మంట‌ల వేడుక‌ల్లో చంద్ర‌బాబుతో క‌లిసి ప‌వ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ టీడీపీ-జ‌న‌సేన ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌ల‌వ‌కూడ‌ద‌ని ఎన్నో కుట్ర‌లు చేశారని ఆరోపించారు.

ఐదు కోట్ల ప్ర‌జా రాజ‌ధాని కోసం 33 వేల ఎక‌రాలు త్యాగం చేసిన రైతుల్లో నిజ‌మైన సంక్రాంతి శోభ నిండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి ప‌ట్టిన పీడ‌, కీడుని భోగి మంట‌ల్లో త‌గ‌ల‌పెట్టామ‌ని ఆయ‌న అన్నారు. వ‌చ్చే ఏడాది త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో సంక్రాంతిని ఘ‌నంగా జ‌రుపుకుందామ‌ని అన్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ద్వంద్వ కామెంట్స్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబుకు దూరంగా ఉన్న‌ప్పుడు రాజ‌ధాని కోసం 33 వేల ఎక‌రాలు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. సామాన్య ప్ర‌జానీకం రాజ‌ధాని ప్రాంతంలో స్థ‌లం కొనుగోలు చేసి ఇంటిని క‌ట్టుకునే ప‌రిస్థితి వుందా? అని ప్ర‌శ్నించారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల్చి, మ‌ళ్లీ చంద్ర‌బాబును సీఎం సీట్లో కూచోపెట్టాల‌ని ప‌వ‌న్ భావించారు.

అప్ప‌ట్లో మంగ‌ళ‌గిరిలో లోకేశ్‌కు వ్య‌తిరేకంగా జ‌న‌సేన పోటీ చేయ‌లేదు. అలాగే మిత్ర‌ప‌క్ష‌మైన సీపీఐ అభ్య‌ర్థిని నిలిపి క‌నీసం ప్ర‌చారం చేయ‌లేదు.  ప‌వ‌న్ నిలిచిన గాజువాక‌, భీమ‌వ‌రంల‌లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీళ్లిద్ద‌రి లోపాయికారి ఒప్పందాన్ని జ‌నం గ్ర‌హించి ఘోరంగా ఓడించారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత బీజేపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకున్నారు. కానీ చంద్ర‌బాబుతో అంట‌కాగుతున్నారు.

ఇప్ప‌టికీ బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోకుండా, టీడీపీతో సీట్ల అవ‌గాహ‌న చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య ఎడ‌బాటు వుంటే క‌దా విడిపోవ‌డానికి అని నెటిజ‌న్లు చీవాట్లు పెడుతున్నారు.