కులం కోసం చేరదీస్తే పవన్ కు షాక్ తప్పదంతే!

‘‘ఆయన ఈ దేశం గర్వించుకునేలా తన ప్రతిభను ప్రదర్శించిన అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరు. తన రంగంలో దేశం గర్వించేలా అత్యుత్తమ సేవలు అందించారు. ఆయన ప్రజాసేవలోకి రావాలని అనుకోవడం చాలా గొప్ప పరిణామం. ఆ…

‘‘ఆయన ఈ దేశం గర్వించుకునేలా తన ప్రతిభను ప్రదర్శించిన అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరు. తన రంగంలో దేశం గర్వించేలా అత్యుత్తమ సేవలు అందించారు. ఆయన ప్రజాసేవలోకి రావాలని అనుకోవడం చాలా గొప్ప పరిణామం. ఆ ఆలోచనలో మొదట ఒక తప్పటడుగు వేశారు. కానీ చాలా తొందరగానే తన తప్పును తెలుసుకుని, దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను జనసేన పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఆయన సేవలను ప్రజలకోసం వాడుకుంటుంది. ఆయనకు సముచితమైన గౌరవం లభిస్తుంది’’

ఇలాంటి పడికట్టు పదాలతో కూడిన సినిమా డైలాగులు తొందరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ నోటమ్మట మనం వినవలసి రావొచ్చు. ఇవాళ తొలి భేటీ పూర్తయింది. రేపో మాపో ఆయన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీ కండువా కప్పుకోవడం కూడా లాంఛనంగా పూర్తి కావొచ్చు.

కప్ప గెంతుల కంటె ఘోరంగా అరంగేట్రం లోనే స్థిరత్వం లేకుండా పార్టీ మారుతున్న అంబటి రాయుడును పవన్ కల్యాణ్ ఎందుకు చేరదీస్తున్నారు.. అనేది ఆ పార్టీ కార్యకర్తలకు మిలియన్ డాలర్ ప్రశ్న. ఇంతకూ అంబటి రాయుడును పవన్ కల్యాణ్ ఎందుకు చేరదీస్తున్నారు? ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు?

కేవలం కులం ఒక్కటే కారణం అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఉండే కొన్ని వందల కులాలు అన్నింటికీ రాజకీయ అధికారం కట్టబెట్టేస్తానని పడికట్టు పదాల డైలాగులు వల్లిస్తూ ఉంటారు. ఆయన కులాల పేర్లన్నీ తన ప్రసంగాల్లో ఏకరవు పెడుతుంటారు. అయితే వాస్తవంలో కాపు కులం ఓట్లను నమ్ముకుని మాత్రమే ఆయన రాజకీయం చేస్తున్నారనేది అందరికీ తెలిసిన సంగతి.

అంబటి రాయుడు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గనుక.. హఠాత్తుగా పవన్ కల్యాణ్ కు ప్రేమ పుట్టుకు వచ్చింది. అయితే అంబటి రాయుడు రాజకీయాల్లోకి రాదలచుకున్నప్పుడు.. ఫస్ట్ ఆప్షన్ జనసేన కాకుండా వైఎస్సార్ సీపీ ని ఎంచుకున్నారని, తాను ఆశించిన గుంటూరు ఎంపీ సీటు కోసం అక్కడ ఠికానా లేకపోయేసరికి.. ప్లేటు ఫిరాయించి, ఇప్పుడు జనసేనలో చేరాలని అనుకుంటున్నారని జనసైనికులు భావిస్తున్నారు. ఇలాంటి అవకాశవాది వ్యక్తిని చేరదీస్తే.. పవన్ కల్యాణ్ పార్టీకోసం తొలినుంచి కష్టపడుతూ, పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తున్న వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హఠాత్తుగా ఇలాంటి అవకాశవాద నాయకుల్ని పార్టీలోకి తీసుకువచ్చి పెద్దపీట వేస్తే.. కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కు పోటీచేయడానికి తగిన నాయకులు గతిలేక ఇలా అంబటి వంటి అవకాశవాదులకు కూడా రెడ్ కార్పెట్ పరుస్తున్నారా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.