భారత రాష్ట్ర సమితి పార్టీని పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేసే కసరత్తు చాలా చురుగ్గా జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చాలా చురుగ్గా ఎంపీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు పెట్టుకుంటూ.. ఎంపీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన అవసరం గురించి కేటీఆర్ తమ పార్టీ నాయకులు అందరికీ నొక్కి చెబుతున్నారు. పార్లమెంటులో తమ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుందని కూడా అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము చేసిన కొన్ని తప్పుల వల్లనే పార్టీ ఓటమి పాలైనట్టుగా కేటీఆర్ చెబుతున్నారు. ఏదో అనాలి కాబట్టి ఆ మాట అంటున్నారో.. లేదా, నిజంగానే తప్పులు చేశామనే ఆత్మ పరిశీలనకు వచ్చారో తెలియదు గానీ.. ఈ సమీక్ష సమావేశంలో ఆయన చెబుతున్న కొన్ని మాటలు వింటే.. ఇన్నాళ్లూ ఆ పని చేయకపోవడం వల్లనే కదా.. గులాబీలు దారుణంగా ఓటమి పాలైంది అనే అభిప్రాయం ఎవ్వరికైనా కలుగుతుంది.
ఇంతకూ కేటీఆర్ ఏం చెబుతున్నారంటే.. ‘‘ఈ సమీక్ష సమావేశాల్లో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. మీరు చెప్పిన ప్రతి అభిప్రాయం నోట్ చేసుకుంటాము’’ అని అంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీ చేయని పని కూడా అదే. పార్టీలో ఎవ్వరికీ మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా మోనార్క్ ధోరణిని అవలంబించడం వల్లనే.. ఇవాళ వాళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందనేది జనంలో నానుతున్న మాట.
‘శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. అందుకే ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు పెడుతున్నాం’ అని కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడుకునే అవకాశం రాలేదని కేటీఆర్ ఎలా చెబుతున్నారో మాత్రం అర్థం కాని సంగతి. ఎందుకంటె కొన్ని నెలల ముందుగానే అభ్యర్థులను కూడా ప్రకటించేసిన తర్వాత కనీసం వారితో మాట్లాడడానికి, సెగ్మెంట్లలోని ఇతర నాయకులతో కలిపి పరిస్థితులను తెలుసుకోవడానికి కూడా సమయం లేకపోవడం అనేది దేనికి నిదర్శనంగా అనుకోవాలి.
కేసీఆర్ జమానాలో ఎమ్మెల్యేలకు కూడా కనీసం కేటీఆర్, కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని.. ఇతర నాయకులు ఎవ్వరికీ కూడా అందుబాటులో ఉండేవారు కాదనేది ప్రధానమైన కంప్లయింటు.
గెలుపు గురించి మితిమీరిన నమ్మకం మాత్రమే కాదు. పార్టీ నాయకుల, కార్యకర్తల మాట వినిపించుకునే ధోరణి గానీ, వారికి అపాయింట్మెంట్ ఇచ్చే ధోరణి గానీ లేకపోవడం వల్లనే వారికి క్షేత్రస్థాయి వాస్తవాలు బోధపడలేదు.
మితిమీరిన అహంకారంతో ప్రవర్తించడం వల్లనే పార్టీ ఓడిపోయిందనేది ఇప్పటికైనా భారాస అధినాయకులు అంగీకరించాలి. ఎవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లనే ఓడామని అంగీకరించి.. పార్టీ కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకుంటేనే.. వారికి విలువ ఇస్తేనే భారాస పార్లమెంటు ఎన్నికల్లోనైనా నెగ్గగలదని అనుకోవచ్చు. ఆ దిశగా కేటీఆర్ మాటలు ఒక ముందడుగే అని అనుకోవచ్చు.