వారెవ్వా.. క్రికెట్ కంటే అంబ‌టి రాజ‌కీయ క్రీడ అదుర్స్‌!

ఇటీవ‌ల కాలంలో క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. దీనికి కార‌ణం ఆయ‌న రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌డ‌మే. రెండు వారాల క్రితం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో అంబ‌టి రాయుడు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.…

ఇటీవ‌ల కాలంలో క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. దీనికి కార‌ణం ఆయ‌న రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌డ‌మే. రెండు వారాల క్రితం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో అంబ‌టి రాయుడు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఆయ‌న పోటీపై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రిగింది. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన అంబ‌టి రాయుడిని గుంటూరు ఎంపీ బ‌రిలో నిలుపుతార‌ని అంద‌రూ అనుకున్నారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీకి రాజీనామా చేసి ఆయ‌న షాక్ ఇచ్చారు. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా వైసీపీలో అంబ‌టి రాయుడు కొన‌సాగ‌లేక‌పోయార‌ని, ఆ పార్టీ ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌తిప‌క్షాలు ఎద్దేవా చేశాయి. రాజీనామాకు దారి తీసిన ప‌రిస్థితుల్ని ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ నెల 20నుంచి దుబాయ్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ టీ 20 లీగ్ మ్యాచ్‌ల్లో ముంబ‌య్ ఇండియ‌న్స్ త‌ర‌పున పాల్గొనాల్సి వుంద‌ని, రాజ‌కీయ అనుబంధం వుండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే కొంత‌కాలం దూరంగా వుండాల‌ని రాజీనామా చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు.

ఇంత‌టితో అంబ‌టి గురించి చ‌ర్చ ముగిసింద‌ని అనుకుంటే, మ‌రోసారి ఆయ‌న ట్విస్ట్ ఇచ్చారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో బుధ‌వారం అంబ‌టి రాయుడు భేటీ అయ్యారు. దీంతో జ‌న‌సేన‌లో అంబ‌టి చేరుతార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. జ‌న‌సేన‌లో చేరి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తార‌ని ప‌లువురు అంటున్నారు.

రోజుకో మాట చెబుతూ, క్రికెట్ కంటే రాజ‌కీయ క్రీడ‌ల్లో బాగా రాణిస్తాన‌ని అంబ‌టి నిరూపించుకున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. అంబ‌టి రాజ‌కీయ ప్ర‌వేశం విమ‌ర్శ‌ల‌తో మొద‌లు కావ‌డం గ‌మ‌నార్హం. అంబ‌టిలో స్థిర‌త్వం లేక‌పోవ‌డం విమ‌ర్శ‌కు ప్ర‌ధాన కార‌ణ‌మైంది.