తిరుగులేని అధికారాన్ని కూటమి సొంతం చేసుకుంది. ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజాతీర్పు వెలువడింది. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న అధికార పార్టీ నేతలు… ఇక తమకు తిరుగే లేదని అత్యుత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అధికారుల నియామకంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ విభాగాలకు సంబంధించి పోస్టింగ్‌లకు లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పట్టణ, పారిశ్రామిక, వ్యాపార కేంద్రాలకు నిలయమైన ప్రాంతాల్లో తహశీల్దార్, డీటీ, ఆర్ఐ తదితర పోస్టులకు బేరాలు బాగా పలుకుతున్నాయి.
ఏది తీసుకున్నా లక్షల్లో మాటే. ప్రముఖ పుణ్యక్షేత్రానికి సమీపంలోని నియోజకవర్గంలో తహశీల్దార్ పోస్టుకు అధికార పార్టీ ఎమ్మెల్యే రూ.40 లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలిసింది. ప్రభుత్వం నుంచి రెవెన్యూ అధికారుల బదిలీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాగానే, సదరు తహశీల్దార్‌ను నియమించడానికి ఆర్థిక ఒప్పందం కుదిరింది.
అలాగే డీఎస్పీ, సీఐ, ఎస్ఐ పోస్టులకు కూడా ఇదే రీతిలో లక్షల్లో బేరాలు కుదుర్చుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆదాయం వుంటుందనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి, పోస్టులు దక్కించుకోడానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆసక్తి చూపడం గమనార్హం. ఇలా లక్షల్లో కప్పం కట్టి, పోస్టులు తెచ్చుకున్న అధికారులు… విధి నిర్వహణలో ఎంతగా దోపిడీకి పాల్పడుతారో అర్థం చేసుకోవచ్చనే చర్చ జరుగుతోంది.