స్టీల్ ప్లాంట్ ఇపుడు అటూ ఇటూ తిరిగి కేంద్రలో కొత్తగా ఉక్కు మంత్రిగా చేరిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చెంతకు చేరింది. ఆ శాఖకు ఆయనే అధిపతి. ఆయన కొత్తగా శాఖ చేపట్టి పదిహేను రోజులు మాత్రమే అయింది. కానీ విశాఖ ఉక్కు బాధ్యతలు మాత్రం ఆయన మీదనే ఉన్నాయంటూ కొందరు నాయకులు వెళ్ళి కలిశారు. అయితే విశాఖ ఉక్కుని ఉరికంబం మీద నిలబెట్టే చర్యలు అన్నీ 2021 ఫిబ్రవరిలోనే తీసుకున్నారు. గడచిన మూడున్నరేళ్లుగా ఏ మాత్రం లేవలేని విధంగా కోలుకోలేని విధంగా ఉక్కుని వధ్య శిల మీద పెట్టి మరీ నరకం చూపిస్తున్నారు.
అయితే తాజాగా కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామిని ఢిల్లీలో బీజేపీ నేతలు అంతా కలిశారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో పాటు ఉక్కు ఉద్యమకారులు అంతా కలసి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.
విశాఖ ఉక్కు కష్టాలు చెప్పి కాపాడాలని ఆయన కోరారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉక్కు పరిశ్రమను టేకోవర్ చేయాలని వారు కోరారు. భారత స్టీల్ పరిశ్రమకే నూతన పవర్ హౌస్ గా విశాఖ ఉక్కు ఉపయోగపడుతుందని వారు చెప్పారు. అయితే అంతా విన్న కుమారస్వామి అలాగే అని అన్నారు.
కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఈ విషయంలో అసలైన నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా కుమారస్వామి తన పలుకుబడితో విశాఖ ఉక్కుని ఒడ్డున పడేస్తే మాత్రం అది గొప్పతనం అవుతుంది. నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడుతుందా.కుమార సంభవం సాధ్యమేనా అన్నదే కార్మిక లోకం అంతా ఆసక్తిగా గమనిస్తున్న విషయం.