విధ్వంస రచనకు హైకోర్టు బ్రేకులు!

చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చాలా మెత్తగా మాటలు చెబుతూ ఉన్నారు. కానీ పనులు మాత్రం దారుణాలు జరిగిపోతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేయకూడని చోట చేసినందుకు మాత్రమే…

చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చాలా మెత్తగా మాటలు చెబుతూ ఉన్నారు. కానీ పనులు మాత్రం దారుణాలు జరిగిపోతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేయకూడని చోట చేసినందుకు మాత్రమే జగన్ సర్కారు ప్రజా వేదికను కూల్చేసింది. దానికి ప్రతీకారం అన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలు అన్నింటినీ కూల్చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టుగా ఉంది.

నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని కార్యాలయాన్ని నేలమట్టం చేసేయడం వారి దుర్మార్గానికి ప్రతీక. అలాగే రాష్ట్రంలో 23 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా అడ్డగోలుగా కడుతున్నారంటూ వారికి నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాటన్నింటినీ కూల్చేయడానికే ఫిక్సయ్యారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే చంద్ర సర్కారు విధ్వంస పోకడలకు హైకోర్టు ద్వారా చిన్న బ్రేకు పడింది.

మా పార్టీ కార్యాలయాలను కూల్చివేయ బోతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఆఫీసులకు నోటీసులు ఇచ్చిన వైనం వారు అందులో పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయి పోయిన భవనాలకు కూడా ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని  వారు వివరించారు.

అయితే ఇప్పటికిప్పుడు కార్యాలయాలను కూల్చివేయడం లేదని, నోటీసులు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. అలాగే.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత.. ఏ సంగతి కోర్టుకు నివేదిస్తానని న్యాయవాది పేర్కొన్నారు. కేసు విచారణను గురువారానికి వాయిదావేసిన హైకోర్టు.. అప్పటిదాకా స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది. ఇది వైసీపీకి చాలా చిన్న ఊరట. గురువారం నాడు మళ్లీ విచారణ జరిగినప్పుడైనా ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి.

సాధారణంగా ఇలాంటి సందర్భంలో కొన్నాళ్లు ఆ పార్టీ వారికి గడువు ఇచ్చి అప్పటిదాకా ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా ఆగాలని ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. కానీ కోర్టు చెప్పగల గడువులోగా అయినా వారు సమర్పించిన ప్లాన్ లకు అనుమతులు తెచ్చుకోగలరా? చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టిన వ్యవహారం నిజమే అయితే గనుక.. అనుమతులు మాత్రం ఎలా వస్తాయి? అనేది అందరి సందేహం.

వైసీపీ కార్యాలయాలకు హైకోర్టు ద్వారా ఊరట దక్కినా అది తాత్కాలికం మాత్రమే అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.