కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆదాయ వనరులపై ఆ పార్టీల నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాపారాల్ని ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు అడ్డుకున్నారు. వాటిని కొన్ని చోట్ల ఆక్రమించడం, మరికొన్ని చోట్ల నెలకు కొంత సొమ్ము ఇచ్చేలా అవగాహనకు వచ్చారు.
ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే.. తన వాళ్లు ఎర్రమట్టి, ఇసుక తదితర ప్రకృతి వనరుల్ని దోపిడీ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్యకర్తల్ని, గ్రామ, మండల స్థాయి నాయకుల్ని తాము బాగా పట్టించుకుంటామనే సంకేతాల్ని పంపడానికి కొత్త ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తిరుపతికి సమీపంలోని ఆ ఎమ్మెల్యే… ఇసుక, ఎర్రమట్టిని తోలుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, టీడీపీ కార్యకర్తలు, నాయకులు చెలరేగిపోతున్నారు.
ఇసుక, ఎర్రమట్టికి సంబంధించి విధివిధానాలు వచ్చేందుకు ఇంకా నెల రోజుల సమయం పట్టొచ్చని, ఈ లోపు ప్రకృతి వనరుల్ని ఇష్టమొచ్చినట్టు ఒక చోట నిలువ చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. వీటి ద్వారా ఆదాయాన్ని పొందాలని తన అనుచరులకు సదరు కొత్త ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుపడకుండా అంతా తాను చూసుకుంటానని ఎమ్మెల్యే భరోసాతో కార్యకర్తలు, నాయకులు చెలరేగిపోతున్నారనే చర్చ మొదలైంది.
గతంలో వైసీపీ గ్రామ, మండల స్థాయి నాయకులు ఇసుక, మట్టిని ఇష్టానుసారం కొల్లగొట్టి, ఆర్థికంగా లబ్ధి పొందారని, ఇప్పుడు తమ వాళ్లు ఆ పని చేస్తే తప్పేంటని సదరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ చెబుతున్నదొకటి, కిందిస్థాయిలో జరుగుతున్నది మరొకటి. ఆదాయం వచ్చే పనుల్ని చేయకుండా టీడీపీ, జనసేన నాయకుల్ని ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి.