పోరాట‌మే జ‌గ‌న్ బ‌లం … అదే మ‌రిచాడు!

లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక‌లో ఎన్డీఏకి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఈ చ‌ర్య‌తో జనం దృష్టిలో ఇంకో మెట్టు దిగిపోయాడు. అస‌లు జ‌గ‌న్ బ‌ల‌మే పోరాటం. దాన్ని మ‌రిచిన‌ప్పుడే డౌన్‌పాల్ ప్రారంభ‌మైంది. Advertisement వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి…

లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక‌లో ఎన్డీఏకి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఈ చ‌ర్య‌తో జనం దృష్టిలో ఇంకో మెట్టు దిగిపోయాడు. అస‌లు జ‌గ‌న్ బ‌ల‌మే పోరాటం. దాన్ని మ‌రిచిన‌ప్పుడే డౌన్‌పాల్ ప్రారంభ‌మైంది.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కాంగ్రెస్‌లో వుంటూనే ఆ పార్టీతో పోరాడాడు. ఒక ద‌శ‌లో సొంతంగా పార్టీ పెడ‌దామ‌ని ఆలోచించినా విర‌మించుకున్నాడు. రాష్ట్రంలో (89-94) కాంగ్రెస్ అధికారంలో వున్న‌ప్పుడు కేంద్రంలో (91-96) పీవీ ప్ర‌ధానిగా వున్న‌ప్పుడు ఆయ‌న‌కి ఎలాంటి ప‌ద‌వి రాకుండా ప్ర‌త్య‌ర్థులు అడ్డుప‌డ్డారు. ఎన్ని ఎదురైనా ఆయ‌న కాంగ్రెస్‌లో నంబ‌ర్ 1 నాయ‌కుడిగానే వుంటూ 2004లో ముఖ్య‌మంత్రి అయ్యారు. దీనికి కార‌ణం పోరాడే త‌త్వం.

వైఎస్ కుమారుడిగా జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న మీద ఎవ‌రికీ దృష్టి లేదు. వైఎస్ అనంత‌రం ఒక నాయ‌కుడిగా పోరాటం ప్రారంభించిన‌ప్పుడు హీరో అయ్యాడు. సోనియాని ధిక్క‌రించి పార్టీ పెట్టిన‌ప్పుడు, జైలుకి వెళ్లిన‌ప్పుడు ఒక కొత్త నాయ‌కుడిని జ‌నం చూసారు. దీనికి కార‌ణం భ‌యం లేకుండా, ఎంత‌టి క‌ష్ట‌మొచ్చినా ఎదుర్కొనే త‌త్వం.

ఓదార్పు, పాద‌యాత్ర‌ల‌తో జ‌నానికి ద‌గ్గ‌ర‌య్యాడు. జ‌గ‌న్ పాల‌న‌లో భ‌రోసా వుంటుంద‌ని సామాన్యులు న‌మ్మారు. వెన‌క‌డుగు వేయ‌కుండా పోరాడుతాడు, త‌మ‌లో ఒక‌డిగా వుంటాడు. ఇంత‌కు మించి ఏం కావాలి? గెలిపించారు. ముఖ్య‌మంత్రిని చేసారు.

అప్ప‌టి వ‌ర‌కు ఉన్న జ‌గ‌న్ వేరు, త‌ర్వాత వేరు. పోరాడేత‌త్వం పోయింది. ప్ర‌జ‌ల‌తో క‌లిసే ప్ర‌వృత్తి మారింది. ప‌థ‌కాలు ఇస్తే ప్ర‌జ‌లు ఆరాధిస్తార‌నే భ్ర‌మ‌కి లోనై చాలా మందిని దూరం చేసుకున్నారు. కార్య‌క‌ర్త‌ల్లో అస‌హ‌నం, నాయ‌కుల‌కి గౌర‌వం లేదు.

ఇవ‌న్నీ ఒక ఎత్తైతే అన్నింటికీ కేంద్రంతో రాజీ ప‌డ‌డం ఆశ్చ‌ర్యాన్ని, ఆగ్ర‌హాన్ని క‌లిగించింది. ఇదంతా రాష్ట్ర అభివృద్ధి కోస‌మే అయితే ప్ర‌జులు ఏదో స‌మాధాన‌ప‌డేవారు. అయితే కేసుల భ‌యంతోనే బీజేపీకి డూడూబ‌స‌వ‌న్న అంటున్నాడ‌ని జ‌నం విశ్వ‌సించ‌సాగారు. అక్క‌డి నుంచి జ‌గ‌న్ గ్రాఫ్ ప‌డిపోవ‌డం స్టార్ట్ అయ్యింది.

మీడియాకి క‌న‌ప‌డ‌డు. బ‌ట‌న్ నొక్క‌డానికి త‌ప్ప జ‌నం మ‌ధ్య‌కి రాడు. పోనీ బీజేపీ నుంచి స్పెష‌ల్ స్టేట‌స్‌, ప్ర‌త్యేక నిధులు ఏమైనా తెస్తాడా అంటే అదీ లేదు.

వైఎస్ వార‌సుడిగా జ‌నం త‌న‌ని గుర్తించార‌ని, జ‌గ‌న్ అనుకున్నాడు. కానీ అది పాక్షిక‌మే. కేవ‌లం లాంచింగ్ పాడ్‌. జ‌గ‌న్ భ‌య‌ప‌డ‌డు, పోరాడుతాడు అని జ‌నం గుర్తించ‌డ‌మే అస‌లు విజ‌యం. దానికి గండికొట్టుకున్నాడు.

మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టి చంద్ర‌బాబుని ముఖ్య‌మంత్రిగా చేసిన బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికి ప‌లుచ‌న అయిపోయాడు. అలాగ‌ని ఇండియా కూట‌మికి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేడు. గ‌తం గుర్తుకొస్తుంది. సోనియా కోపాన్ని ఎదిరించి జ‌గ‌న్ హీరో అయ్యాడు. బీజేపీ కోపానికి భ‌య‌ప‌డి జీరో అవుతున్నాడు. త‌ర్వాత ఆయ‌న చంద్ర‌బాబుపై ఎన్ని పోరాటాలు చేసినా జ‌నం చూసి న‌వ్వుకుంటారు.

Comments are closed.