మీడియా మీద నిజాయతీ బాధ్యత

2019 నుంచి 2024 వరకు ఆంధ్రలో అరాచకం అంతకు మించిన అన్నీ జరిగిపోయాయి. సర్వం భ్రష్టుపట్టేసింది. జగన్ అనే రావణాసురుడు ఆంధ్రను సర్వనాశనం చేసేసాడు. అందరూ రంగంలోకి దిగకపోతే, ఇక ఆంధ్రలో మిగిలేది బూడిద…

2019 నుంచి 2024 వరకు ఆంధ్రలో అరాచకం అంతకు మించిన అన్నీ జరిగిపోయాయి. సర్వం భ్రష్టుపట్టేసింది. జగన్ అనే రావణాసురుడు ఆంధ్రను సర్వనాశనం చేసేసాడు. అందరూ రంగంలోకి దిగకపోతే, ఇక ఆంధ్రలో మిగిలేది బూడిద తప్ప మరేం లేదు అన్న రేంజ్ పరిస్థితి నెలకొంది అని వైకాపా మినహా మిగిలిన రాజకీయ పక్షాలు అన్నీ ఒకే తాటి మీదకు వచ్చినపుడు పలు మీడియా సంస్థలు అండగా వుండడానికి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా లీడింగ్ లో వున్న ఈనాడు లాంటి సంస్థలు. చాలా కష్ట పడ్డాయి. ప్రతిపక్షాలకు మించి అక్షర పోరాటం సాగించాయి. అనుకున్నది సాధించాయి. కోరుకున్న కూటమి అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు ఆంధ్రలో ప్రతిపక్షమే లేదు. పద కొండు మందిలో ఎవరు కూడా అసెంబ్లీకి వచ్చేలా కనిపించడం లేదు. ఇది ఒక సమస్య. మరో పక్క అధికారంలోకి వచ్చిన వారు అప్పుడే తొందరపడుతున్నారు. ఆంధ్రలో దారుణమైన దాడులు జరుగుతున్నాయి. ఇది ఆరోపణ కాదు. వీడియోలు కళ్ల ముందు తిరుగుతున్నాయి. ఓ మనిషిని మరో మనిషి ఇంత దారుణంగా కొట్టడం చూసి జనం అవాక్కవుతున్నారు. ఇసుక దందాలు, ఇతరత్రా దందాలు మామూలే.

ఇక్కడ ఓ సమస్య వుంది. సోషల్ మీడియాలో వైకాపా జనాలు ఎవరు ఈ విషయం చెప్పినా చిత్రమైన ఎదురుదాడి వస్తోంది. మీరు కొట్టలేదా.. మీరు చేయలేదా.. మీరా చెప్పేది.. మీరా మాట్లాడేది అంటూ. అంటే ఇక్కడ అనుమానం వాళ్లు అలా చేసారు అనే కదా, రావణ ప్రభుత్వం. సర్వ నాశనం, సర్వ భ్రష్టత్వం అనే భీకర పదాలు అన్నీ వాడి ఈ మీడియాలు అన్నీ కలిసి కష్టపడి కూటమిని అధికారంలోకి తెచ్చారు.

మరి ఆ ప్రభుత్వం కూడా అలాగే చేస్తే మళ్లీ మాట్లాడాల్సింది అదే మీడియానే కదా. ఇప్పుడు కూటమిని అధికారంలోకి తెచ్చిన మీడియా సంస్థలు తమ నిజాయతీని నిరూపించుకోవాలి. పార్టీ ఏదైనా ఆంధ్రను రావణకాష్టంగా మారుస్తాము, దందాలు కొనసాగిస్తాము అన్నపుడు మళ్లీ అదే అక్షర ఆయుధాని చేత పట్టాలి. లేదంటే ఇది రాష్ట్రం మీద ప్రేమ కాదు, కేవలం పార్టీ మీద ప్రేమ.. ఫలనా పార్టీ మీద పగ అని కాస్త ఆలస్యమైనా జనం తెలుసుకుంటారు. కానీ అప్పటి వరకు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ వుంటుంది.

కానీ మరోసారి రివర్స్ లో అక్షర ఆయుధం పట్టుకుంటాం అంటే అప్పుడు మరి నమ్మకపోవచ్చు. నిజాయతీ వెనుక వెళ్తే కలిగే, సంపాదించే నమ్మకం వేరు కదా.