ఈ ప్రశ్నకు సులభంగా చెప్పే సమాధానం లైంగికాసక్తితో! అయితే కేవలం లైంగికాసక్తే ప్రేమ భావన అనుకుంటే.. మనిషికీ, జంతువుకీ ఏ మాత్రం తేడా లేనట్టే! జంతువుల్లో ఒకరి పట్ల రొమాంటిక్ ఇంట్రస్ట్ అనే ప్రశ్నే లేదు! మనిషి కూడా జంతువుల్లో భాగమే అయినా, లైంగేచ్ఛ విషయంలో జంతువాంఛ అనేది అథమ స్థాయిగా పరిగణిస్తారు. జంతువుల తీరుతో సంబంధం లేకుండా మనిషి లైంగికాసక్తితో కూడిన ప్రేమ భావనలను ఏర్పరుచుకుంటాడని, దీనికి కారణం మనిషి శరీరంలో ఉండే రసాయనిక శాస్త్రమే అని పరిశోధకులు ఎప్పటి నుంచినో చెబుతూ ఉన్నారు!
వారు చెప్పేదని ప్రకారం అయితే.. సోల్ మేట్ అనే మాటే లేదు! శాస్త్రీయంగా తవ్వే కొద్దీ మనిషి ప్రేమలో పడటానికి గుండెది ఏ మాత్రం సంబంధం లేని పాత్ర అని, అదే.. మనసుది ఏ మాత్రం సంబంధం లేని పాత్ర అనే విశ్లేషణలే వినిపిస్తాయి. ప్రధానంగా మెదడే ప్రేమలో పడేలా చేస్తుందనేది శాస్త్రీయ పరిశోధకులు చెప్పే మాట! ప్రేమ అనేది పూర్తిగా మనసు ఆధీనంలోనిది అని, ప్రేమ అంటే మనసు ఇచ్చి పుచ్చుకోవడమనేది కవితాత్మకంగా చెప్పుకునేది, ప్రేమ కవిత్వం, ఆరాధనపూర్వకమైన మాటలు అన్నీ మనసు మీదే సాగుతాయి! అయితే అసలు కథ మెదడుదే అని అంటాయి శాస్త్రీయ పరిశోధనలు!
పర్ఫెక్ట్ అనిపించిన వారి మీదే ప్రేమ భావన!
యుక్త వయసులో కలిగే ప్రేమ భావన కావొచ్చు, మళ్లీ మళ్లీ ప్రేమలో పడటం కావొచ్చు.. ఎవరి మీద ప్రేమ భావన కలుగుతుంది అంటే, ఆ సమయానికి పర్ఫెక్ట్ గా అనిపించిన వారి మీదే ప్రేమ కలుగుతుంది! కనీసం ఆ సమయానికి అయినా మెడదు ఆ పర్ఫెక్షన్స్ ను డిసైడ్ చేస్తుంది. కళ్లతో చూసే ప్రేమలో పడతారు. ఆ కళ్లకు పర్ఫెక్ట్ అనే కొలతలు ఏమిటో మెడదే కదా నిర్ణయించేది!
న్యూరోకెమికల్ ఇన్ ఫ్లుయెన్స్!
ప్రేమ భావనను బలపరిచేది న్యూరో కెమెకల్ ఇన్ ఫ్లుయెన్సెస్ అంటారు. పర్ఫెక్ట్ అనిపించిన వారిపై ప్రేమ భావనలు కలిగినప్పుడు మెదడు నుంచి కొన్ని హార్మోన్ల జననం కలుగుతంది. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటొనిన్. వీటి కెమిస్ట్రీ ప్రేమ భావనలను వ్యాపింపజేస్తాయట! డోపమైన్ కు సుఖమైన భావనను కలిగించే శక్తి ఉంటుంది, ఆక్సిటోసిన్ బాండింగ్ ను నమ్మకాన్ని పెంపొందించే లక్షణముంటుంది, సెరోటోనిన్ సోషల్ బిహేవియర్ ను, మూడ్ ను నిర్దేశిస్తుందట. రొమాంటిక్ భావనలు కలిగినప్పుడు ఈ హార్మోన్లు మెదడును వరదలా ముంచెత్తుతాయి. వీటి ప్రభావం వల్ల పర్ఫెక్ట్ అనిపించిన వ్యక్తి మీద ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడుతుందనేది ప్రేమకు ఉన్న శాస్త్రీయమైన నిర్వచనం! ఈ న్యూరో కెమికల్ ప్రాసెస్ అట్రాక్టివ్ గా అనిపించి, అందుబాటులో ఉన్న వ్యక్తుల మీద కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పదే పదే అదే జరిగితే!
ఈ న్యూరో కెమికల్ ప్రాసెస్ ఎవరు కళ్లకు నచ్చితే వాళ్ల విషయంలో జరగొచ్చు. వారి నేపథ్యం, వయసు వంటి లాజిక్ లు అన్నింటినీ మెదడే డిసైడ్ చేస్తుంది. ఈ లాజిక్ లు శాటిస్ ఫై అయిన తరుణంలో న్యూరో కెమికెల్ ఇన్ ఫ్లుయెన్స్ కొనసాగుతుంది. క్లాస్ మేట్ లనో, కొలీగ్ నో, సొంతూరి అమ్మాయినో, పెళ్లిలో కలిసే బంధువుల పిల్లనో లవ్ చేస్తున్నారంటే.. ఇవన్నీ లాజికల్ రీజనింగ్స్. ఈ రీజనింగ్సే కెమికల్ ప్రాసెస్ కు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.
లక్షణాలను చూసి ప్రేమించినా!
కొందరు చెబుతూ ఉంటారు, శరీరాన్ని చూసి కాదు లక్షణాలను చూసి ప్రేమించామని. అవతలి వారి ఆత్మవిశ్వాసంగా కనిపించారనో, మరోటనో చెబుతూ ఉంటారు. అవి కూడా నిస్సందేహంగా ఆకర్షణలే. తమ జీవితంలో లోటుగా భావించిన క్వాలిటీలు మరొకరిలో కనిపిస్తే అలాంటి వాటికి ఆకర్షితులైనప్పుడు కూడ న్యూరో కెమికల్ ప్రాసెస్ పుంజుకోవచ్చనేది శాస్త్రీయమైన థియరీ.