మేకలు జీవించేది మేత కోసమే అని, అందుకే మే అని అరుస్తాయని ఒకాయన కనిపెట్టాడు. అంతే కాకుండా అవి మే నెలని బాగా ఇష్టపడతాయని సూత్రీకరించాడు. తెలిసింది తెలియనట్టు వుంటే అజ్ఞానం. ఇదంతా అక్షరబద్ధం చేసి అచ్చోసిన మేకలా జనం మీద పడ్డాడు.
మేకోపనిషత్తు పుస్తకాన్ని గట్టిగానే ఆవిష్కరించారు. వక్తలు చాలా మంది వచ్చారు కానీ, వాళ్లెవరూ పుస్తకం చదవలేదు. అట్టహాసం పాటించారు. అట్టని చూసి నవ్వుతూ మాట్లాడ్డం.
ఒకాయన నీళ్లు తాగి, పుక్కిలించి, గొంతు సవరించుకున్నాడు. ఆయన స్వరగతిని గుర్తెరిగిన వాళ్లు ఎందుకైనా మంచిదని నిష్క్రమణ ద్వారం వద్దకి పరుగు తీసారు. ఎప్పటిలాగే ఆయన స్టార్ట్ చేసాడు.
“తెలుగు భాష గొప్పతనం ఏమంటే అక్షరాలకి కొమ్ములుంటాయి. అక్షర జ్ఞానులకి కొమ్ములు మొలవడానికి ఇదే కారణం. ఇక మేకకి కూడా కొమ్ములుంటాయి. ఆ విషయం తెలియకుండానే అది జీవిస్తుంది. కోయడానికి వచ్చిన వాన్ని కూడా పొడవదు. బతికి మనం ఏం పొడిచాములే అనేది దాని ఫిలాసపీ. దంతం లేకుండా జీవించవచ్చు కానీ, వేదాంతం లేకుండా జీవించలేం. మేకోపనిషత్తు అనే పదం వ్యాకరణ రీత్యా తప్పు. అసలు వ్యాకరణం అనే పదం ఎలా వచ్చిందంటే, కరణాలు మాట్లాడే వాక్యాలను జల్లెడ పట్టి వ్యాకరణం తయారు చేసారు. అందుకని ఇక్కడ మేక ఉపనిషత్తు అంటే మేకకి చెందినదైనా కావచ్చు. మేకుకి చెందినదైనా కావచ్చు.
రచనల్లో మేకులు చల్లడం వల్ల, పాఠకుడికి గుచ్చుకుని నిద్రపోకుండా లేపుతాయి. మేకు చైతన్యానికి ప్రతీక. జీవితం తలకిందులుగా వుందని నమ్మేవాళ్లు మేకుని కూడా తలకిందులు చేసి గోడకి కొడుతుంటారు. దీని వల్ల గోడకి చెవులేర్పడుతాయి. ఏదీ వినకపోవడమే చెవుల గొప్పతనం.
మేకలు ఈ సత్యాన్ని గ్రహించడం వల్ల అవి చెవి ఒగ్గి వినవు. వాటి చెవులు వేలాడుతూ వుంటాయి. వినే శక్తే వుంటే , మెడ నిమురుతున్న వాడే , కత్తితో నరుకుతాడని గ్రహించేవి.
మేకకి విశ్వాసం ఎక్కువ. తిండి పెట్టకపోతే కుక్క కరుస్తుంది. మేక తానే తిండిగా మారుతుంది. మేకతోక చిన్నదిగా ఎందుకుందంటే దానికి ఈగలు, దోమలంటే భయం లేదు. తోలుకోవాల్సిన అవసరం లేదు.
జీవితం చాలా చిన్నది అనడానికి మేకతోక ఒక ఉదాహరణ. తోక తిప్పకు, తోక కత్తిరిస్తా, తోక పెరిగిందే ఇలాంటి భాషా సౌందర్యాలను మేక మీద మనం ప్రయోగించలేం. ఎందుకంటే అది మేక కాబట్టి.
మేకకి, మేకుకి తులనాత్మక పరిశీలన ఏమంటే మేకకి కొమ్ములుంటాయి. మేక అనే పదంలో కొమ్ములుండవు. మేకుకి కొమ్ములుండవు. పదంలో కొమ్ము వుంటుంది. మేకని కొట్టాల్సిన పనిలేదు. చెప్పినట్టు వినడం దాని నైజం. మేకుని కొడితే తప్ప మాట వినదు. దానికో సుత్తి వుండాలి. ఇనుముని ఇనుముతోనే కొట్టాలి. సుత్తిని వాస్తవానికి ఎన్ని ప్రయోజనాలకి వాడినా, మేకుని కొట్టడం దాని ప్రాధమిక విధి. ఏ విధీ లేకుండా జీవించడం మనిషి లక్షణం.
మేకలకున్న సామూహికత్వం మనిషికి లేదు. అందుకే అవి మే మే అని అరుస్తూ వుంటాయి. మేమంతా ఒకటే అనే అంతర్గత నినాదం అది. మేకలకి మే నెల అంటే ఎందుకిష్టమంటే కార్మిక దినోత్సవం వచ్చేది ఆ నెలలోనే కాబట్టి. మేకల్ని చంపి తింటారు. కార్మికులని బతికుండగానే తింటారు.
ఇంతకీ ఈ రచయిత ఈ పుస్తకం ఎందుకు రాసాడో తెలియదు. ఎందుకు చదవాలో పాఠకులకీ తెలియదు. ఏదీ తెలియకపోవడమే బ్రహ్మజ్ఞానం.
మేకలు అరణ్య జీవులు. వాటి కోసం అరణ్యకాలు రాయాలి కానీ, ఉపనిషత్తు ఎందుకు రాసినట్టు? చదువొచ్చిన వాళ్లకి ఎలాగూ జ్ఞానం అబ్బదు. చదువురాని మేకకైనా జ్ఞానం వస్తే సంతోషం.
అయినా ఎంతటి జ్ఞానమేకయినా దాని చివరి మజిలి పలావే కదా. జనం వండినవాన్ని మెచ్చుకుంటారు కానీ, మేక త్యాగాన్ని గుర్తిస్తారా?
రచయితలు కూడా మేకల్లాంటివాళ్లు. పాఠకుల్ని నమ్ముకుని జీవిస్తున్నారు. రచయితల్ని కబేళాకి తరలించే పనిలో వున్నారని తెలియక అచ్చేసిన పుస్తకాల్ని, అట్టపెట్టెల్లో సర్ది అటకలో భద్రపరిచి సంతోషిస్తున్నారు. చాలా సమయం తీసుకున్నాను. ఇక మిగిలిన వక్తలు మాట్లాడుతారు” అని వాళ్ల వైపు చూసాడు.
వాళ్లు నిద్రలోకి జారుకోవడమే కాకుండా, గురక కూడా పెడుతున్నారు. నిష్క్రమణ దగ్గర నలుగురు వస్తాదుల్ని కాపలా పెట్టడం వల్ల వీక్షకులు పారిపోయే సాహసం చేయలేకపోయారు.
తానేం రాసాడో, విన్నాడో మరిచిపోయి రచయిత మేమే అని అరిచాడు.
జీఆర్ మహర్షి