వైసీపీ ఎంపీలు పార్టీ మారుతారనే ప్రచారంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రోజుకో పార్టీ మారే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి లాంటి వాళ్లకు అలాంటి ఆలోచనలు వస్తుంటాయన్నారు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్‌రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ నాయకత్వంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పని చేస్తారని ప్రకటించారు. ఎల్లో మీడియా తమపై దుష్ప్రచారం చేస్తోందని ఆయన తప్పు పట్టారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా వారిలాగే అందరూ పార్టీ మారుతారని అనుకుంటుంటారని అవినాష్‌రెడ్డి దెప్పిపొడిచారు.
కడప ఎంపీగా హ్యాట్రిక్ సాధించడం సంతోషంగా వుందన్నారు. వైఎస్ జగన్ ఆశీస్సులు, కడప ప్రజల మద్దతు, తమ పార్టీ కార్యకర్తల కష్టంతో ఎంపీగా గెలిచానన్నారు. ఎన్నికల సందర్భంలో తనపై భారీగా తప్పుడు ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. వాటిని కడప ప్రజలు పట్టించుకోకుండా, గెలిపించారని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఏ మాత్రం లేవన్నారు.
2019లో తాము విజయం సాధించినప్పుడు ఏ ఒక్కరిపై దాడి చేయలేదన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారే తప్ప, ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్లా హింసకు పాల్పడలేదన్నారు. ఒకవైపు చంద్రబాబు కవ్వింపు చర్యల్ని ఉసిగొల్పుతూ, మరోవైపు నీతిసూక్తులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా తన పార్టీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబుకు అవినాష్ సూచించారు.