కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ఏపీ పౌరులు డేగ కన్నేసి ఉంచారు. ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు. జగన్ పాలన నచ్చకపోవడంతో ఆయన్ను ఇంటికి సాగనంపారు. బాబు నేతృత్వంలోని కూటమి ఇచ్చిన హామీలకు జనం జై కట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో కూటమికి 164 అసెంబ్లీ సీట్లు దక్కాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు ….కూటమి ప్రభుత్వంపై భారీ బాధ్యత వుంది. ఎన్నికల హామీలను అమలు చేయడం కూటమి ముందున్న అతిపెద్ద సవాల్.
మొదటి కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే చంద్రబాబు సర్కార్ కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. దీంతో మొదటి సమావేశమే తుస్సుమంది. వైసీపీ ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాల విడుదల, అవినీతిపై కమిటీలు వేయాలని నిర్ణయించారు. అలాగే డబ్బు ఖర్చు కాని వాటిపై మొదట దృష్టి సారించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయడం విశేషం. టీడీపీ అనుకూల మీడియాలో చంద్రబాబు సర్కార్ చాలా గొప్పగా పాలన మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది.
అయితే ప్రజలు విజ్ఞులని గమనంలో పెట్టుకోవాల్సి వుంటుంది. హామీలకు సంబంధించి లబ్ధి కలిగిందా? లేదా? అన్నదొకటే ప్రజలకు కావాలి. గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాల విడుదల, అవినీతిపై కమిటీలు, విచారణ, జైలుకు పంపడాలు తదితరాలన్నీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కక్ష రాజకీయాలుగానే ప్రజలు చూస్తారు. తమకు ప్రయోజనం కలిగేలా పాలన వుంటే, కక్షపూరిత వ్యవహారాల్ని ప్రజలు పెద్దగా పట్టించుకోరు.
అందుకు భిన్నంగా పాలన సాగితే మాత్రం… అధికారాన్ని కక్ష తీర్చుకోడానికి వాడుకున్నారని ప్రజలు ఆగ్రహిస్తారు. ఎందుకంటే తమను మోసగించారనే భావనను ప్రజలు జీర్ణించుకోలేరు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయని నేటి పాలకులు నిత్యం గమనంలో పెట్టుకోవాలి. శ్వేత పత్రాల విడుదల అంటేనే ప్రజల్లో ఏదో అనుమానానికి బీజం వేస్తోంది. జగన్ సర్కార్ అప్పులన్నీ చేసి, ఖజానా ఖాళీ అయ్యిందని, కావున హామీలను అమలు చేయకపోవడానికి జగనే కారణమని చెబుతారనే చర్చ అప్పుడే మొదలైంది.
చంద్రబాబునాయుడిని జనం ఇప్పుడే కొత్తగా చూడడం లేదు. 45 ఏళ్లుగా బాబును దగ్గరగా చూస్తున్న వారున్నారు. కొత్త ఓటర్లకే ఆయన పాలనారీతులు తెలియవు. పాలనలో చంద్రబాబుకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వుంది. అదేంటో రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా చూడనున్నారు.
చంద్రబాబు మీడియాను నమ్ముకున్నారు. ఏవైనా కారణాలతో హామీలను అమలు చేయని పక్షంలో, వాటిని తన అనుకూల మీడియా కవర్ చేస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఆయన విశ్వాసం వమ్ము కాదు. కానీ ప్రజలు తమకు ప్రయోజనం కలగకపోతే దేన్నీ విశ్వసించరని చంద్రబాబు గుర్తించుకుంటే మంచిది. కావున ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా సాకులేవీ చెప్పకుండా, సాధ్యమైనంత త్వరగా తాము ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు ఇంకా ఏమీ చెప్పలేదేం అని జనం మాట్లాడుకుంటున్నారు. తన పాలనను ఎంత నిశితంగా గమనిస్తున్నారో చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.