ఎవరి మనుషులు.. ఏ పార్టీ వారు.. అన్న సంగతి పక్కన పెడితే, వాలంటీర్ల వ్యవస్థ మాత్రం అధ్భుతమైన క్రియేషన్. అందులో సందేహం లేదు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసాయన్నది వాస్తవం. గ్రామీణ జనాలు మండల కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని సగానికి సగం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ వ్యవస్థను చంపేసే ప్రయత్నం చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం.
అయితే అది నేరుగా చేయకుండా జనసేన భుజం మీద తుపాకి వుంచి కాల్చే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ లు అంటూ పెట్టారు. అవి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చాయి. తప్ప మంచి పేరు కాదు. ప్రజలు ఈ కమిటీలతో విసిగిపోయారు. తెలుగుదేశం పార్టీ ఓటమిలో కొంత శాతం వాటా ఈ జన్మభూమి కమిటీలదే.
కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ లో వుంది. వాలంటీర్ల వ్యవస్థ ప్రజలను ఆకట్టుకుంది. చిన్న చిన్న సమస్యలు వుండొచ్చు. కొంతమంది బ్యాడ్ బాయిస్ వుంటే వుండొచ్చు. కానీ అంత మాత్రం చేత వాలంటీర్ల వ్యవస్థ ను పక్కన పెట్టేయడానికి లేదు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి రెండు సమస్యలు. ఒకటి.. అదృష్టం బాగుండి తాము అధికారంలోకి వస్తే, ఈ వ్యవస్థను ఎలా రద్దు చేయాలా?అన్నది. రెండవది ఈ వ్యవస్ధ వల్ల వైకాపా కు ఎన్నికల్లో ప్రయోజనం వుంటుందేమో అన్న భయం రెండోది.
ఈ రెండూ పరిష్కారం కావాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అదే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కానీ, దాని మూలాల్లో దాగిన సామాజిక వర్గానికి కానీ వచ్చిన విద్య ఒక్కటే. బురద వేసేయడం. మేం బురద వేసాం.మీరు కడుక్కోండి అనే విద్య బాగా వచ్చు. జగన్ మీద కావచ్చు, జలయజ్ఙం మీద కావచ్చు లేటెస్ట్ గా వాలంటీర్ల మీద కావచ్చు. అడ్డగోలుగా బురద వేసేయడం..సైలంట్ అయిపోవడం. తాము ఇంజెక్ట్ చేయాలనుకున్న విషం జనాల్లోకి పంపేయడం, తమకే పాపం తెలియదన్నట్లు ఊరుకోవడం.
అయితే జనాలకు పనికి వస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ను తాము టార్గెట్ చేస్తే సమస్య అవుతుందని తెలుగుదేశం పార్టీకి తెలుసు. అందుకే ఈ పనిని పవన్ కళ్యాణ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో వైకాపాను పక్కకు తప్పించే బాధ్యత, వెళ్లిన ప్రతి చోటా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే అసైన్ మెంట్ ఎలా అప్పగించారో, అలాగే వలంటీర్ల మీద బురదేసే బాధ్యత కూడా పవన్ కు అప్పగించినట్లు కనిపిస్తోంది. దాంతో పాటు దీనిని కొనసాగించే బాధ్యత తెలుగుదేశం అనుకూల మీడియా కూడా తీసుకున్నట్లుంది.
జనాల్లోకి ఓ అనుమానం పంపించేసారు. మీ సంగతులు అన్నీ వాలంటీర్ల ద్వారా క్రిమినల్స్ కు చేరిపోతున్నాయి అనే అనుమానాన్ని పవన్ పంపించారు. జనాల మనసుల్లో ఓ భయాన్ని నాటాలి. అమాయక జనం భయపడాలి. ఆ విధంగా వాలంటీర్ల వ్యవస్ధ వల్ల వైకాపాకు ఏదో జరుగుతుంది అనేది వుంటే కాస్త న్యూట్రల్ కావాలి. అదే స్కీము.
కానీ పవన్ కు అయినా, తేదేపా కు అయినా తెలియని సంగతి, గమనించని సంగతి ఏమిటంటే ప్రతి యాభై ఇళ్లకు ఓ వలంటీర్ వున్నారు. ఈ వలంటీర్ ఎక్కడి నుంచో వచ్చిన వలంటీర్ కాదు. వాళ్ల ఇళ్ల మధ్య వున్నవాళ్లనే ఎంపిక చేసారు. మావయ్యా.. బావా.. అన్నా.. అక్కా అనే వాళ్లే. అందువల్ల వీళ్ల గురించి వాళ్లకీ తెలుసు. వాళ్ల గురించి వీళ్లకూ తెలుసు. అందువల్ల ఈ విషబీజాలు అంత సులువుగా నాటుకోవు.
కానీ దీనివల్ల తెలుస్తోంది ఏమిటంటే, వాలంటీర్ల గురించి భయపడేలా చెప్పే ప్రయత్నం చేస్తున్న పవన్, తేదేపా వర్గాల మనసుల్లో వున్న భయం మాత్రమే. కానీ ఇప్పుడు ఆ భయం రెట్టింపు అవుతుంని. పవన్-చంద్రబాబు ప్రభుత్వం వస్తే తమకు సమస్య అవుతుందని వాలంటీర్లకు క్లారిటీ వచ్చేసింది. ఇక వారిలో తొంభైశాతం మంది వీరికి ఓట్లు వేయడానికి కావచ్చు, ఓట్లు వేయించడానికి కావచ్చు జంకుతారు.
పైగా జగన్ కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేలో, పదిహేను వేలో జీతం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని వరం ఇచ్చారనుకోండి. అంతే ఇక ప్రతిపక్షం సీన్ సితారే.