తన వీరాభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో చాలెంజింగ్ స్టార్ దర్శన్ కు కోర్టులో చుక్కెదురైంది. దర్శన్ కు వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాల్ని చూపించడంతో, కోర్టు అతడి రిమాండ్ ను పొడిగించింది. వచ్చేనెల 4 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. దీంతో దర్శన్ ను బెంగళూరులోని పరప్పన సెంట్రల్ జైలుకు తరలించారు.
రూ. 40 లక్షలు అప్పు చేసిన దర్శన్
ఈ కేసుకు సంబంధించి మరిన్ని కొత్త విషయాల్ని వెలికితీశారు పోలీసులు. సాక్ష్యాల్ని తారుమారు చేసేందుకు ఉన్నఫలంగా డబ్బులు అవసరం పడ్డంతో, స్నేహితుడి నుంచి దర్శన్ 40 లక్షల రూపాయలు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇందులో కొంత డబ్బును రేణుకాస్వామి హత్యకు గురైన షెడ్డు దగ్గర ఉన్న వ్యక్తులకు దర్శన్ ఇచ్చాడు. ఒకవేళ కేసు అయితే తన పేరు బయటకు చెప్పకూడదనే షరతు మీద ఆ డబ్బులిచ్చాడు. అంతా సెట్ అయిన తర్వాత మరింత డబ్బు ఇస్తానని కూడా చెప్పాడట. ఆ డబ్బుతో పాటు దర్శన్ ఇంటి నుంచి కొంత మొత్తాన్ని, దర్శన్ అభిమాన సంఘం సెక్రటరీ రాఘవేంద్ర ఇంటి నుంచి ఇంకొంత మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుడ్ని చెప్పుతో కొట్టిన పవిత్ర..
రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి షెడ్డుకు తీసుకొచ్చిన వెంటనే దర్శన్, అతడి ప్రేయసి పవిత్ర ఇద్దరూ షెడ్డుకు వెళ్లారట. ఈ ఘటనలో తన తప్పు లేదని కోపంతో 2 దెబ్బలు మాత్రమే కొట్టానని దర్శన్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అటు పవిత్ర కూడా 2 దెబ్బలు మాత్రమే కొట్టిందట. తన చెప్పు తీసి రేణుకాస్వామిని కొట్టినట్టు పోలీసులు రిపోర్ట్ లో వెల్లడించారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని దర్శన్ అనుచరులు పూర్తిచేశారు.
రాఘవేంద్ర చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
ఎప్పుడైతే పోలీసులు రంగంలోకి దిగారో, సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు తీవ్రంగా శ్రమించాడు రాఘవేంద్ర అలియాస్ రఘు. దర్శన్ కు వీరాభిమాని అయిన ఈ వ్యక్తి రేణుకాస్వామి సెల్ ఫోన్ తో పాటు, తన ఫోన్ ను కూడా డ్రైనేజీలో పడేశాడు. హత్య చేసినప్పుడు వేసుకున్న నిందితులు వేసుకున్న దుస్తుల్ని కూడా మాయం చేసింది ఇతడేనని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బలమైన సాక్ష్యాలు సేకరించిన పోలీసులు.. దర్శన్-పవిత్రలను తమ కస్టడీకి కోరుతూ, సోమవారం కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు.