చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన రెండో పర్యటన మొదలెట్టారు. గురువారం నాడు ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం ఏకైక లక్ష్యంగా, ఈ పర్యటనలోని అంతరార్థంగా ప్రజలకు కనిపిస్తోంది. రాబోయే ఐదేళ్లలో తాను ఏ పనీ చేయకుండా ఉండిపోయినా, లేదా, అమరావతి రాజధాని నిర్మాణంలో అడుగులు వేయడానికి వీలైనంత జాప్యం చేసినా ఆ పాపం మొత్తం జగన్మోహన్ రెడ్డికి అంటుకునేలాగా చంద్రబాబు వ్యూహ రచన కనిపిస్తోంది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడ పనులు ప్రస్తుతం ఏయే దశల్లో ఉన్నాయో వాటిని పూర్తి చేయడం ఎలాగో పరిశీలించి సమీక్షించడం అవసరమే. దాన్ని ఎవరూ తప్పుపట్టరు! అమరావతి రాజధానిని పూర్తి చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అయితే రాజధాని నిర్మాణం పట్ల చిత్తశుద్ధి కంటే, రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లడమే పెద్ద లక్ష్యం అయినట్లుగా ఆయన టూర్ ప్లాన్ ఉంటున్నది.
చంద్రబాబు నాయుడు తొలుత జగన్మోహన్ రెడ్డి కూల్పించిన ప్రజా వేదిక వద్ద నుంచి అమరావతి యాత్ర ప్రారంభిస్తారని ప్రకటించారు. నిజానికి ప్రజావేదిక వద్ద శిధిలాలు తప్ప పరిశీలించడానికి ఏమీ లేదు. ఒకవేళ అక్కడ మళ్ళీ అలాంటి భవనమే కావాలని చంద్రబాబు కలగంటే గనుక, ఆ మేరకు అధికారులను పురమాయిస్తే సరిపోతుంది. కానీ, ఆ ప్రాంతాన్ని విజిట్ చేయాలని అనుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కూల్చిన శిధిలాలను రాష్ట్ర ప్రజలకు చూపించి ఆయనపై బురద చల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
రాజధాని పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే కనుక ఆగిపోయిన ఇతర నిర్మాణాలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు, న్యాయమూర్తుల, ఉద్యోగుల క్వార్టర్లు ఇలాంటివి పరిశీలించి అక్కడ ఇంకా ఏ పనులు పూర్తి చేయాలో, ఏ వేగంతో ఎప్పటికీ డెడ్లైన్ విధించుకుని పూర్తిచేయాలో ఆయన ఆదేశిస్తే సరిపోతుంది. కానీ ప్రజావేదికతో ప్రారంభించడం అనేది ఒక వ్యూహంగా పలువురు భావిస్తున్నారు.
ఈ పర్యటన తర్వాత- అమరావతి నిర్మాణాలన్నీ అత్యంత ఘోరంగా తయారయ్యాయని వీటిని తిరిగి ప్రారంభించడానికి చాలా జాప్యం, అదనపు వ్యయం అవుతుందని అందుకు జగన్ ప్రధాన కారకుడని చంద్రబాబు సాకులు చెప్పినా ఆశ్చర్యం లేదు. పోలవరం విషయంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాయమాటలే చెప్పి తాను ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నాను ఆ స్పష్టీకరించకుండానే వచ్చేసారు.
అమరావతి విషయంలో కూడా కేవలం అలాంటి మాయమాటలు మీద ఆధారపడితే ప్రజలు తనను క్షమించరు అని చంద్రబాబు తెలుసుకోవాలి.