ఆంధ్ర ప్రభుత్వ పరిస్థితి మధ్య తరగతి జనాల బతుకుల్లా మారింది. అమ్మో.. ఒకటో తారీఖు అనే విధంగా వుంటోంది. జూలై ఫస్ట్ కి ఇంకా పది రోజులు వుంది. ఆ నాటికి పది వేల కోట్లు కావాలి. పెంచిన ఫించన్లు, ఇవ్వాల్సిన పింఛన్లు, జీతాలు, ప్రభుత్వ పింఛన్లు అన్నీ కలిపి పదివేల కోట్లు కావాలి. అప్పు తప్ప మరో మార్గం లేదు. అందుకే చెల్లింపులు అన్నీ ఆపేసి, నెలాఖరున అప్పు చేసి ఫస్ట్ న అన్నీ చెల్లించి, శహభాష్ అనిపించుకోవాలని ప్రభుత్వం పద్దతిగా ఆలోచిస్తోంది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలకు కలిపి 47 వేల కోట్లు రుణాలు తీసుకునే వెసులుబాటు వుందట. కానీ ఇప్పటికే వైకాపా ప్రభుత్వం 25 వేల కోట్ల రుణాలు వాడేసింది. ఇక మిగిలింది 22 వేల కోట్లు. ఇప్పుడు ఈ రుణం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
నిజానికి అవసరాల కోసం ఇప్పుడు తీసుకుందామని అధికారులు అన్నారట. కానీ ఫస్ట్ తారీఖు వస్తుంది. అప్పుడు అవసరం అని ప్రభుత్వం బ్రేక్ వేసింది. జూన్ 25 కు తీసుకుని ఫస్ట్ కి అందరికీ చెల్లింపులు చేసి బెస్ట్ అనిపించుకునే మంచి ఆలోచన అది.
కానీ మిగిలిన 22 వేల కోట్ల రుణంలో ఇప్పుడు ఓ పదివేల కోట్లు డ్రా చేస్తే, మిగిలిన 12 కోట్లు వచ్చే నెలకు సరిపోతాయి. ఈ లోగా బిల్లుల చెల్లింపులు వంటివి జరగాలి అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా కోసం వెయిట్ చేయాలి.
మొత్తానికి కూటమి అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేసి ముందుకు వెళ్లాల్సిందే. వైకాపా అప్పులు చేస్తే, ప్రయారిటీ వేరుగా వుండేది. అస్మదీయులకు బిల్లుల చెల్లింపు అనేది ముందు వరుసలో వుండేది. అందువల్ల జీతాలు, ఫించన్లు లేటయ్యేవి. కూటమి ఆ అపవాదు భరించడానికి సిద్దంగా లేదు. అందుకే రుణాలను తెచ్చినా, వాటిని ముందుగా పింఛన్లు, జీతాలకు కేటాయిస్తోంది.
పైగా ఇప్పుడు బిల్లులు చెల్లించాల్సిన అర్జన్సీ లేదు. ఎందుకంటే ఆ బిల్లలు అన్నీ వైకాపా హయాంలోనివే. తేదేపా హయాంలో బిల్లులు ప్రారంభం కావడానికి టైమ్ పడుతుంది. ఆలోగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం జరుగుతుంది.
కానీ ఏమైనా ఒకటి.. కొన్నాళ్ల వరకు లేదా కొన్నేళ్ల వరకు బిల్లులైనా, జీత భత్యాలైనా, ఫింఛన్లు అయినా అప్పు తేవాల్సిందే. అది వైకాపా ప్రభుత్వం అయినా. కూటమి అయినా.