ఏపీ నూతన హోంమంత్రి వంగలపూడి అనిత వృత్తిరీత్యా అధ్యాపకురాలు. బోధనా రంగం నుంచి ఆమె రాజకీయ రంగంలో అడుగు పెట్టారు. పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. 2019లో ఆమె ఓడిపోయినప్పటికీ, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా చురుకైన పాత్ర పోషించారు. తద్వారా చంద్రబాబు కుటుంబానికి దగ్గరయ్యారు.
ఈ నేపథ్యంలో ఆమెకు కీలకమైన హోంశాఖ మంత్రిత్వ శాఖను అప్పగించారు. తనకు హోంశాఖ దక్కిన నేపథ్యంలో అనిత శాంతి పాఠాలు బోధిస్తున్నారు. కిందిస్థాయి నుంచి పోలీస్‌శాఖను ప్రక్షాళన చేస్తామని ఆమె అన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని చెప్పారు. కొందరు పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని రాజకీయ టీచరమ్మ హెచ్చరించడం గమనార్హం. ఒకవేళ మార్పు రాకపోతే తామే మారుస్తామని కుండబద్ధలు కొట్టినట్టు తేల్చి చెప్పారు.
గతంలో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై సమీక్షిస్తామన్నారు. గతంలో పోలీసులు తనపై అట్రాసిటీ కేసులు పెట్టారని గుర్తు చేశారు. లేని దిశ చట్టాన్ని గత ప్రభుత్వంలో చూపించారని ఆమె ఆగ్రహించారు. పోలీసులు చట్టప్రకారం పనిచేయాలని పాఠాలు చెప్పారు. అన్యాయాలపై ఉక్కుపాదం మోపుతామని అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. వచ్చీ రాగానే పోలీసులు ఎలా వ్యవహరించాలో అనిత పాఠాలు చెప్పడం చర్చనీయాంశమైంది. గతాన్ని గుర్తు చేయడం ద్వారా, కొందరికి హెచ్చరిక పంపినట్టైంది.