ఔనన్నా, కాదన్నా చంద్రబాబు ప్రభుత్వానికి రాజధాని అమరావతి నిర్మాణం మొదటి ప్రాధాన్య అంశం. ప్రభుత్వాలు శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు పట్టం కట్టారని, ఇదే ఆదరణ 2029 ఎన్నికల్లో వుంటుందనే నమ్మకం టీడీపీకి లేదు. అందుకే రెండున్నరేళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించే ఆలోచనలో టీడీపీ వుంది. ఈ మేరకు ఆ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చే నడుస్తోందని సమాచారం. గతంలో కూడా రూ.10 కి తక్కువ కాకుండా అమరావతి నిర్మాణానికి విరాళం పంపాలని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా రూ.100కు తక్కువ కాకుండా విరాళం పంపాలని పిలుపు ఇస్తే ఎలా వుంటుందని టీడీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం.
ఈ ఆలోచనను టీడీపీలోని కొంత మంది నేతలు తప్పు పడుతున్నారు. గతంలో ఇట్లే పిలుపు ఇచ్చి, మిగిలిన ప్రాంతాలకు శత్రువులయ్యామని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి దోచేస్తోందనే సంకేతాలు వెళ్తాయని, తమ ప్రాంతాల కోసం విరాళాలను ఎందుకు సేకరించరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందనే వాదన చేసినట్టు తెలిసింది. అయితే అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల కోట్లైనా పెట్టుబడి పెట్టాల్సిందే అని, ఆ తర్వాతే మిగిలిన అంశాలని మరికొందరు టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కూటమి మొదటి ప్రాధాన్యత అమరావతి నిర్మాణమని, ప్రజలు కూడా ఆమోదించడం వల్లే అన్ని ప్రాంతాల్లో తిరుగులేని మద్దతు లభించిందని కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలు వాదిస్తున్నట్టుగా తెలిసింది. అమరావతి కోసం విరాళాల ప్రకటన ఆలోచన ఏ మేరకు ఆచరణకు నోచుకుంటుందో చూడాలి.