వైఎస్సార్ పేరు పోయి.. ఎన్టీఆర్ పేరు వ‌చ్చె!

ఏపీలో అధికార మార్పిడితో ప‌రిపాల‌న‌ప‌ర‌మైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పింఛ‌న్ ప‌థ‌కానికి వైఎస్సార్ పేరు తొల‌గించి, ఎన్టీఆర్ పేరు పెట్ట‌డం విశేషం. వైఎస్సార్ భరోసా ప‌థ‌కాన్ని ఎన్టీఆర్ భ‌రోసాగా మారుస్తూ ప్ర‌భుత్వ…

ఏపీలో అధికార మార్పిడితో ప‌రిపాల‌న‌ప‌ర‌మైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పింఛ‌న్ ప‌థ‌కానికి వైఎస్సార్ పేరు తొల‌గించి, ఎన్టీఆర్ పేరు పెట్ట‌డం విశేషం. వైఎస్సార్ భరోసా ప‌థ‌కాన్ని ఎన్టీఆర్ భ‌రోసాగా మారుస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్‌కుమార్ ఉత్త‌ర్వులిచ్చారు. సీఎం చంద్ర‌బాబునాయుడు చేసిన ఐదు సంత‌కాల్లో పింఛ‌న్ పెంపు ఫైల్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంత‌కాలం అమ‌లు చేసిన రూ.3 వేల పింఛ‌న్‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రూ.4 వేల‌కు పెంచిన సంగ‌తి తెలిసిందే. అలాగే మూడు నెల‌ల ముందు నుంచే పింఛ‌న్ పెంచి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న జూలై 1న పెంచిన పింఛ‌న్ సొమ్మును క‌లుపుకుని మొత్తం రూ.7 వేలు ఇవ్వ‌నున్నారు.  

అలాగే దివ్యాంగుల‌కు కూడా భారీగా పింఛ‌న్‌ను పెంచి ఇవ్వ‌నున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న‌ట్టుగా రూ.3 వేల పింఛ‌న్‌ను రెట్టింపు చేసి, ఇక‌పై రూ.6 వేలు చొప్పున ప్ర‌తినెలా దివ్యాంగుల‌కు పింఛ‌న్ అంద‌జేయ‌నున్నారు. అలాగే పూర్తి స్థాయి దివ్యాంగులకు ఇచ్చే 5 వేల పింఛ‌న్‌ను  15 వేల రూపాయలకు కొత్త ప్ర‌భుత్వం పెంచింది. దీంతో వారికి పెద్ద ఊర‌ట‌గా చెప్పొచ్చు. పింఛ‌న్ల పెంపు వ‌ర‌కూ చంద్ర‌బాబు స‌ర్కార్ మంచి మార్కులే వేయించుకుంది.

అలాగే 50 ఏళ్లు నిండిన బీసీల‌కు పింఛ‌న్ ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. వీరికి ఎప్ప‌టి నుంచి ఇస్తారో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. వారంతా ఎదురు చూస్తున్నారు. ఇంకా ప‌లు సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు త‌మ వంతు ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.