ఘోర పరాజయం మూట కట్టుకుని నిరాశ, నిస్పృహలో ఉన్న వైసీపీలో జోష్ నింపేలా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ సీట్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యం నెలకుంది. ఇప్పుడిప్పుడే షాక్ నుంచి వైసీపీ శ్రేణులు కోలుకుంటున్నాయి. మళ్లీ జనంలోకి వస్తానని జగన్ ప్రకటించడంతో వైసీపీ నేతల్లో భవిష్యత్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఉత్తేజం కలిగించే విషయాలు చెప్పారు. ప్రతిపక్షం బలంగా లేని ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదన్నారు. ఏపీలో ఇప్పుడు ప్రతిపక్షం 11 స్థానాలకు పడిపోయిందన్నారు. అయితే 11 స్థానాలే వచ్చినప్పటికీ , 2019లో చంద్రబాబుకు వచ్చిన ఓట్ల కంటే జగన్‌కు ఒకట్రెండు ఓట్లు ఎక్కువే వచ్చాయన్నారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదన్నారు.
సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన రాజకీయ పార్టీల చాప్టర్లు క్లోజ్ కావన్నారు. తమిళనాడులో 1989లో ఎంజీ రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగాయన్నారు. 1989లో కరుణానిధి పార్టీకి 169 సీట్లు వచ్చాయన్నారు. 30 సీట్లు జయలలిత పార్టీకి వచ్చాయన్నారు. కరుణానిధి సీఎం అయ్యాడన్నారు. 1991లో రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత, ఎల్టీటీఈతో కరుణానిధికి సంబంధాలున్నాయన్న కారణంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు. దీంతో మళ్లీ ఎన్నికలు వచ్చాయన్నారు.
జయలలితకు 285 సీట్లు, కరుణానిధికి ఏడు సీట్లు మాత్రమే వచ్చాయని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. కానీ ఏడుస్తూ కరుణానిధి ఇంట్లో కూచోలేదన్నారు. ప్రతిపక్షంలో కూచున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. 1996 ఎన్నికల్లో కరుణానిధికి 221 సీట్లు, జయలలితకు కేవలం నాలుగే సీట్లు వచ్చాయని ఉండవల్లి చెప్పారు. నిస్సత్తువ, నిస్సహాయత ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావడం అనవసరమని ఉండవల్లి తేల్చి చెప్పారు.