తన మనసులో ఏదీ లేకుండా తాను ఏమీ అనకుండానే ఏదేదో రాస్తున్నారు అని టీడీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన సహజ శైలిలో ఆవేశపడ్డారు. మంత్రి పదవి తనకు కొత్త కాదని ఆయన అంటున్నారు. తాజాగా చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి దక్కలేదని తాను అసంతృప్తిగా ఉంటున్నాను అన్న ప్రచారం పట్ల అయ్యన్న మండిపడ్డారు.
అలాంటిది ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. తాను అలా ఎపుడూ ఫీల్ కాలేదని అన్నారు. ఏపీలో మంచి ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నానని అలాగే జరిగింది అని ఆయన అన్నారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు.
అయితే ఇక్కడే సరిగ్గా అయ్యన్న ఒక మడత పేచీ పెట్టారు. తనకు మంత్రి పదవి దక్కలేదు అన్న బాధ లేదు అంటూనే టీడీపీ కోసం అయిదేళ్ళుగా పోరాడిన తన మీద కొందరు అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని వారిని తాను ఏ విధంగానూ విడిచిపెట్టను అని అంటున్నారు.
తాను రాష్ట్ర ప్రజల కోసం ఇబ్బంది పడ్డాను అని అయ్యన్న తన అయిదేళ్ల కష్టాన్ని మరో విధంగా వివరించే ప్రయత్నం చేశారు. అందువల్ల అలాంటి అధికారులను తాను క్షమించను ఒకవేళ చంద్రబాబు క్షమించినా ఊరుకోను అని అంటున్నారు.
అయ్యన్నను వేధించిన అధికారుల మీద యాక్షన్ కి ఆయన డిమాండ్ చేస్తున్నారు అన్న మాట. వారి మీద టీడీపీ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే ఓకే. లేకపోతే అయ్యన్న ఎలా రియాక్ట్ అవుతారో. మంత్రి పదవి మీద ఆశలు లేవని ఇపుడు చెబుతున్న అయ్యన్న గతంలో లా అండ్ ఆర్డర్ ని ఎలా కంట్రోల్ లో పెట్టాలో తనకు హోం మంత్రి పదవి ఇస్తే చేసి చూపిస్తాను అని అన్న సందర్భాలు ఉన్నాయి. ఇపుడు అధికారుల మీద యాక్షన్ కోసం కోరుతున్నారు. అయ్యన్నను బాబు మాత్రమే అర్ధం చేసుకోగలరు కాబట్టి ఏమి జరుగుతుందో చూడాలని అంటున్నారు.