గత ఐదేళ్లుగా పదవిలో ఉన్నంత కాలం జగన్ మోహన్ రెడ్డి పంచన ఉన్న కోర్ టీం ఎవరు? సజ్జల రామకృష్ణా రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ధనుంజయరెడ్డి, మిథున్ రెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి..వీళ్లేగా?
పార్టీ మేనేజ్మెంట్ మొత్తం వీళ్ల చేతుల్లో పెట్టి మిగిలిన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల్ని డమ్మీలుగా మార్చినట్టయ్యింది.
పక్క పార్టీ నాయకుల్ని తిట్టాల్సొచ్చినప్పుడు ఆయా నాయకుల కులాలని బట్టి ఇతర నాయకుల్ని డెప్యూట్ చేయడానికి తప్ప సామాజిక సమీకరణం పెద్దగా వాడుతున్నట్టు లేదని ప్రజలు గమనిస్తూ వచ్చారు.
పవన్ ని తిట్టాలంటే పేర్ని నాని, చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వర్ల రామయ్యని తిట్టాలంటే ఏ ఎస్సీ నాయకుడినో ఉసిగొల్పడం చూసాం.
అలా తిట్టించడానికి తప్ప వీళ్లని ఎందులోనూ ప్రధాన పాత్రధారుల్ని చేసినట్టు జనం దృష్టికి రాలేదు. ఒక విధానంలో డెసిషన్ మేకింగ్ గానీ, ఒక ప్రజాప్రయోజనకారకమైన డిస్కషన్లో వీరి మాటలు కానీ ఎవరికీ విన్నట్టులేదు. వీళ్లకి పదవులున్నాయి తప్ప మంత్రిత్వ శాఖకి, పార్టీ వ్యవహారాలకి సంబంధించిన పవర్స్ లేవు. తిట్టడమే వీళ్ల పవరేమో అన్నట్టుగా సాగింది. అసలు పవర్సన్నీ కోర్ టీం దగ్గరే ఉన్నట్టు గడిచింది.
ఏ నాయకులైనా సరే జగన్ మోహన్ రెడ్డిని కలవాలంటే పైన చెప్పుకున్న కోర్ టీం ద్వారా వెళ్లి కలవాల్సిందే.
ప్రాధమికంగా జగన్ ఏర్పరిచిన, ఏర్పరుచుకున్న ఎకో సిస్టం అది.
దీనివల్ల నాయకులకి, జగన్ కి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. వాళ్లకి పార్టీని మానసికంగా సొంతం చేసుకోవడానికి ఈ ఎకో సిస్టం పెద్ద అడ్డయ్యింది.
ఈ కోర్ టీం వల్లనే పార్టీ ఇంత ఘోరంగా ఓడిందన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీ శ్రేణుల్లో.
అలాంటప్పుడు కనీసం ఆ కోర్ టీమునన్నా వెంటనే మార్చుకోవాలి కదా!?
కానీ ఆశ్చర్యమేంటంటే ఈ రోజుకి కోర్ టీం గా వాళ్లే ఉన్నారు. వాళ్లని దాటుకునే ఏ ఇతర వైకాపా సభ్యుడైనా జగన్ ని కలవాలి. ఓడిన తర్వాత సజ్జలని, ధనుంజయరెడ్డిని వేలెత్తి చూపిస్తున్న ఎవరికి మాత్రం జగన్ అపాయింట్మెంట్ దొరుకుతుంది వీళ్లు కోర్ టీం గా ఉన్నంతకాలం!!
అందుకే..జగన్ మారడా? అనే ప్రశ్న వైకాపా శ్రేణుల్లో ప్రబలుతున్న ప్రశ్న.
ఇక ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ వ్యవహరాం చెప్పుకుందాం. కొత్తగా నెగ్గిన 4గురు లోక్ సభ ఎంపీలు, రాజ్యసభలో ఉన్న 11 మంది ఎంపీలు కలిసి 15 మంది వైకాపా ఎంపీలమున్నామని చెప్పుకొచ్చారు. మరి వారిలో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి తప్ప రెడ్డేతరులు లేరా? వాళ్లకి మైకిచ్చి కెమెరా ముందు నిలబెట్టరా?
అయినా విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి ప్రజలతో మమేకమైన రాజకీయనాయకులా? ప్రజలతో ఎమోషనల్ టచ్ ఉన్నవాళ్లా? వీళ్లు మాట్లాడితే వైకాపా అభిమానులైనా భావోద్వేగంతో కనెక్ట్ అవుతారా?
రెడ్డేతరులలో సమర్ధులు లేరా? లేరంటే అర్ధమేంటి? సమర్ధత లేని వారికి రాజ్యసభ ఎంపీ సీట్లు కట్టబెట్టినట్లా? సమర్ధులైతే మరి బయటికి రారెందుకు? ఈ ప్రశ్నలు కొన్ని బలంగా వినిపిస్తున్నాయి.
గత ఐదేళ్లుగా “నా బీసీలు, ఎస్సీలు, నా ఎస్టీలు” అంటూ మంత్రం పఠించిన ఓ జగన్ మోహన్ రెడ్డి!
రెడ్లేనా నీ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేది? వీళ్లేనా పార్టీకి అన్యాయం జరుగుతోందని రాష్ట్రపతికి కంప్లైంట్ చేయడానికి ఢిల్లీదాకా వచ్చింది?
పదవులు పుచ్చుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నీకు మధ్యన అంతా బాగానే ఉండొచ్చు. నిన్ను వాళ్లు “జగనన్న” అని సంబోధిస్తూ వారి ప్రేమని, విశ్వాసాన్ని ఇంకా నీ చెవిలో చాటుకుంటూ ఉండొచ్చు. కానీ కెమెరాల ముందు కనపడందే వారి అండ నీకుందని జనం ఎలా నమ్మేది?
నిజమే..నీవు ఎవర్ని పంపితే వాళ్లే నీ పార్టీని రిప్రజెంట్ చేస్తూ మైకులముందుకొస్తారు. నీ అంతర్గత వర్గం అన్నట్టుగా..నీ అతి సమీప రెడ్డివర్గాన్నే పంపితే ఏ సంకేతాలు వెళ్తాయి సమాజంలోకి?
ఓటు బ్యాంకు వర్గానికి పదవులిస్తే సరిపోదు. వారిని బ్యాక్ సీటులో కూర్చోబెట్టి ముందు వరుసలో రెడ్లే ఉంటారు అంటే కుదరదు. వారిని నాయకులగా ఎదగనీయాలి. అది కుదరనప్పుడు “నా బీసీ, నా ఎస్సీ..” అనే మంత్రం ఉచ్చరించకూడదు.
ప్రజలకైనా సరే తమ వర్గం వారు ప్రధాన నాయకులుగా ఏ పార్టీ నుంచైనా కనిపిస్తున్నప్పుడే వారిలో అధిక శాతం మందికి ఆ పార్టీపై సానుకూల దృష్టి పెరుగుతుంది.
తెలుగుదేశం విషయమే చూడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడుని పార్టీ అధ్యక్షుడిగా నిలబెట్టి అతనిని ముందు వరుసలో ఉంచారు. ఆ స్థాయిలో ఏ రెడ్డేతరుడైనా వైకాపాలో ఉన్నాడా?
ఇక నేడు ఢిల్లీ వెళ్లి మాట్లాడిన రెడ్డినాయకులకి పార్టీలో ఏమైనా న్యూట్రల్ ఇమేజ్ ఉందా అంటే కాదు. పార్టీ ఓడిన తర్వాత వారినే పలువురు వైకాపా నాయకులు వేలెత్తి చూపుతున్నారు. నిజానిజాలెలా ఉన్నా ఈ రకమైన అంతర్గత విబేధాలు రగులుకుంటున్న సమయంలో లౌక్యంగా వ్యవహరిస్తూ రెడ్డేతర లోక్ సభ, రాజ్యసభ ఎంపీలని మైకుల ముందుకు పంపి ఉంటే బాగుండేది.
వాళ్లే ఇష్టం లేక మొహం చాటేసినా, లేక నీ నిర్ణయం వల్లే వాళ్లు ముందుకు రాలేకపోయినా…రెండూ నీ తప్పిదాలే. పై నుంచి కింది దాకా కేడర్ ని, నాయకుల్ని, కార్యకర్తల్ని సంఘటితం చేసి ముందుకు నడిపే నాయకత్వ లక్షణం పదవి లేనప్పుడే బయటపడుతుంది.
చంద్రబాబుని చూడు. కమ్మ వారికి బద్ధ శత్రువులని బ్రాండ్ పడిన కాపు వర్గాన్ని కలుపుకుని ముందుకెళ్లాడు. నాలుగున్నరేళ్ళు ప్రాధేయపడ్డా పట్టించుకోకుండా తిప్పించుకున్న భాజపా పెద్దల్ని కలుపుకోగలిగాడు. నీ సొంత చెల్లెల్ని సైతం తన వైపు తిప్పుకోగలిగాడు. “చంద్రబాబుకి అందరూ శత్రువులే..ఏమీ చేయలేడింక” అని అందరూ గేలి చేస్తుంటే ఆ శత్రువుల్నే మిత్రులుగా మార్చుకుని నీ మీద దండెత్తాడు. అదీ చంద్రబాబు లౌక్యం, నేర్పు, తెలివి, పరిణతి..అన్నీను! తన శత్రువర్గమైన వైకాపా అభిమానులు కూడా ఓటమి బాధలోంచి బయటపడుతూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు.
కానీ నీ పరిస్థితి చూడు. సొంత రెడ్డి సామాజిక వర్గంలోనే ఎందరినో దూరం చేసుకున్నావు. దీనికి కారణం నీ కో టీమే అని వాళ్లంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా నీ కోర్ రెడ్డి టీం ని వదలకపోతే నీ సొంత నాయకుల్లోనే చాలామందిని కోల్పోవలసి వస్తుంది.
ఇదంతా ఓడిపోయావు కాబట్టి చెబుతున్నారని, గెలిచుంటే “అంతమందిని కలుపుకొచ్చిన చంద్రబాబునే మట్టి కరిపించాడు జగన్..ఆహా ఓహో..” అనే వాళ్లని నీవు అనుకోవచ్చు. అది ముమ్మాటికీ నిజం. పాఠమైనా, గుణపాఠమైనా గెలుపోటముల్ని బట్టే తెలుస్తుంది. ముందు ఎవరికీ ఏదీ తెలీదు. తెలిసినట్టు అనిపిస్తుందంతే.
చంద్రబాబు గెలిచాడు కాబట్టి, వైకాపా ఓడింది కాబట్టి అతని స్ట్రాటజీ, పద్ధతి కరెక్ట్.. అంతే.
పేదలకి అన్నీ పంచావని, “నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ..” అని అంటూ ఉన్నావని నీవే గెలుస్తావని నీతో పాటూ, చాలామంది అనుకున్నమాట వాస్తవం. కానీ అలా జరగలేదు.
దానికి కారణాలు పైన చెప్పుకున్నవే.
ఇకనైనా మారితే మళ్లీ మంచిరోజులు రావొచ్చు. ఆ మార్పు కొందరి స్థానాలను మార్చడంతో మొదలవ్వాలి. కోర్ టీం ప్రక్షాళన జరగాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలని నాయకులుగా ఎదగనిచ్చే బాధ్యతలు అప్పగించాలి. ఇవన్నీ చేసుకున్నాకనే ప్రజల్ని, దైవాన్ని నమ్ముకోవాలి. చేసుకోవాల్సిన మార్పులు చేసుకోకపోతే ఆ రెండు శక్తులూ కూడా ఇప్పటిలాగే రానున్న ఐదేళ్లల్లో కూడా ఏమీ చేయలేవు.
పొలిటికల్ కామెంట్: సంపత్ కుమార్