అప్పుడు గోతులు తవ్వి… ఇప్పుడు భజన చేసి…

చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అనే సంగతి అందరికీ తెలుసు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని కూడా అందరికీ తెలుసు. ఆయనలోని ఈ బుద్ధిని చంద్రబాబు మరోమారు విస్పష్టంగా నిరూపించుకుంటున్నారు.…

చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అనే సంగతి అందరికీ తెలుసు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని కూడా అందరికీ తెలుసు. ఆయనలోని ఈ బుద్ధిని చంద్రబాబు మరోమారు విస్పష్టంగా నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం ఉక్కు శాఖకు సహాయ మంత్రి శ్రీనివాసవర్మ విషయంలో రెండు నాలుకల ధోరణి ని బయటపెడుతున్నారు.

భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా కొంత సిద్ధాంతాలను అనుసరించే పార్టీ గనుక.. ఎన్నికలలో పార్టీ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన శ్రీనివాస వర్మకు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించింది. అయితే విపరీతమైన అహంకారంతో నరసాపురం స్థానం ఏ పరిస్థితుల్లోనూ తనకే దక్కుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించిన రఘురామకృష్ణరాజు బిజెపి టికెట్ కోసం చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఆ సీటు ఏ పార్టీకి దక్కినా ఎంపీగా పోటీ చేసేది మాత్రం నేనేనని రఘురామ చాలా గట్టిగా చెప్పుకున్నారు. బిజెపి ఆయనను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంపీగా ఉంటే వందల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు తీసుకుంటూ, ఎగరేస్తూ గొప్ప అడ్వాంటేజీ ఉంటుందనే రుచి తెలిసిన రఘురామ కృష్ణరాజు- వేరే గతిలేక చంద్రబాబును ఆశ్రయించి నరసాపురం ఎంపీ టికెట్ కోసం బిజెపిపై ఒత్తిడి తెచ్చారు.

బిజెపి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు లోపాయికారీ మంతనాలు సాగించారు కూడా. నరసాపురం ఎంపీ టికెట్టును రఘురామకృష్ణ రాజుకి ఇస్తే దానికి బదులుగా ఒకటి లేదా రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం అంటూ పైరవీ చేశారు.

కానీ బిజెపి చంద్రబాబు ప్రతిపాదనను పట్టించుకోలేదు. మా పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టవద్దు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. ఆ రకంగా శ్రీనివాస వర్మను రోడ్డున పడేయడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ఇప్పుడు ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కగానే చంద్రబాబు తన పాట మారుస్తున్నారు. ఆయన చాలా గొప్ప కార్యకర్త అని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం చాలా గొప్ప సంగతి అని .. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

టికెట్ల సమయంలో ఆయనకు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించి.. పదవి దక్కాక పొగడడం అనేది చంద్రబాబుకు మాత్రమే చేతనైన విద్యఅని అంతా అనుకుంటున్నారు.