మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సర్కార్ ప్రత్యేక గౌరవం ఇస్తోంది. జనసేనాని పవన్‌కల్యాణ్‌కు చిరంజీవి సొంత అన్న. తన తమ్ముడిని రాజకీయంగా ఉన్నతంగా చూడాలనే ఆకాంక్షను గతంలో చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి తన తమ్ముడిని గెలిపించాలని చిరంజీవి ప్రత్యేకంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి కోరుకున్నట్టుగానే పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ఉన్నతంగా చూడబోయే సమయం ఆసన్నమైంది.
చంద్రబాబు కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవికి చంద్రబాబునాయుడి నుంచి ప్రత్యేక ఆహ్వానం వెళ్లింది. స్టేట్ గెస్ట్‌గా చిరంజీవి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడకు చిరంజీవి వెళ్లనున్నారు.
గతంలో చిరంజీవి, బాలకృష్ణకు అసలు పడేది కాదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చిరంజీవి నేతృత్వంలో కలిసి సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడారని బాలకృష్ణ కోపగించుకున్నారు. సినీ పరిశ్రమ తరపున వాళ్లందరు మాట్లాడ్డానికి ఎవరని బాలయ్య నిలదీశారు. అప్పట్లో బాలయ్యకు చిరంజీవి సోదరుడు నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం అవన్నీ పక్కకు పోయాయి.
చంద్రబాబునాయుడితో పవన్‌కల్యాణ్ పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి రావడంతో ప్రస్తుతానికి అంతా హ్యాపీగా సాగుతోంది. తమ్ముడితో పాటు అతను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి చిరంజీవి ఆశీస్సులు అందించనున్నారు. తాను రాజకీయంగా విఫలమైనా, తమ్ముడు రాణిస్తున్నందుకు ఆయన సంతోషిస్తుంటారు.