కూటమి ప్రభుత్వం ఏర్పాటులో మరో ముందడుగు పడింది. ఎన్డీఏ కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబునాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జనసేన శాసనసభా పక్ష నేత పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ బాబుపై అభిమానాన్ని చాటుకున్నారు. మరోసారి ఆయన కక్ష సాధింపు చర్యలపై తన వైఖరిని స్పష్టం చేశారు.
ఈ అద్భుత విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయమని పవన్‌కల్యాణ్ అభివర్ణించారు. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తాను 2021లో ఇచ్చిన మాటను గుర్తు చేశారు. ఆ మాటకు కట్టుబడి తాను తగ్గానని, ఇవాళ నిలబడ్డామన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాజం సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు కావాలని భావించినట్టు పవన్‌కల్యాణ్ తెలిపారు.
అందుకే చంద్రబాబు నాయకత్వం, అనుభవం అవసరమని నమ్మానన్నారు. ఈ కారణాలతోనే ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరు బలపరిచినట్టు పవన్‌కల్యాణ్ తెలిపారు. ఏపీలో ఎన్డీఏ అద్భుత విజయం దేశ వ్యాప్తంగా అందరికీ స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు.
ఏపీ ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత మనపై వుందన్నారు. కక్ష సాధింపు చర్యలకు ఇది సమయం కాదని పవన్‌కల్యాణ్ చెప్పడం విశేషం.