బాలశౌరికి పదవి.. పవన్ వద్దన్నారా?

ఎన్డీయే సారథి నరేంద్రమోడీ ఈసారి కేబినెట్ కూర్పులో చాలా వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరించారు. పార్టీలో కీలక నాయకులు అందరికీ న్యాయం చేశారు. కొందరు ప్రముఖుల్ని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జెపినడ్డాను…

ఎన్డీయే సారథి నరేంద్రమోడీ ఈసారి కేబినెట్ కూర్పులో చాలా వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరించారు. పార్టీలో కీలక నాయకులు అందరికీ న్యాయం చేశారు. కొందరు ప్రముఖుల్ని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జెపినడ్డాను కూడా కేబినెట్లోకి తీసుకుని.. ఆ పవికి వేరేవారిని వెతుకుతున్నారు. అలాగే పంజాబ్ నేత గెలవకపోయినా సరే మంత్రిపదవి కట్టబెట్టి.. ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు.

అలాగే భాగస్వామ్య పక్షాలన్నిటికీ కూడా కేబినెట్ లో న్యాయం చేయడం అనేది ఒక సూత్రంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో ఒకే ఒక్క ఎంపీ కలిగిఉన్న అన్ని పార్టీలకు కూడా మంత్రి పదవి దక్కింది. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీకి ఒక ఎంపీ మాత్రమే ఉన్నప్పటికీ.. వారికి సహాయమంత్రి పదవి ఇస్తే వారు తీసకోలేదు. కొంత వేచి ఉంటే కేబినెట్ పదవి ఇస్తాం అని హామీ ఇచ్చారు. అయితే మొత్తం ఎన్డీయే పార్టీలతో మంత్రి పదవి దక్కకుండా ఖాళీగా ఉన్న పార్టీ జనసేన మాత్రమే.

జనసేన రెండు సీట్లు గెలవడంతో పాటు, కేబినెట్ కూర్పులో మోడీ అనుసరిస్తున్న పోకడలను గమనించిన వారంతా ఖచ్చితంగా జనసేనకు కూడా ఒక కేంద్రమంత్రి పదవి హోదా దక్కుతుందని అంచనా వేశారు. వారిలో కాకినాడ ఎంపీ కొత్తవాడు కావడంతో.. సీనియర్ అయిన వల్లభనేని బాలశౌరి కి జాక్ పాట్ తగిలిందని, గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఆయన ఇలా ఫిరాయించగానే జనసేన ఎంపీ టికెట్ దక్కడంతో పాటు, గెలవగానే కేంద్ర మంత్రి పదవి కూడా వరిస్తున్నదని అందరూ అనుకున్నారు.

ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో ఎంతకాలం కొనసాగినా కూడా కేంద్రంలో మంత్రి పదవి అనేది ఆయన ఊహకు అందని సంగతి అని కూడా పలువురు అంచనా వేశారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా బాలశౌరికే కాదు.. అసలు జనసేన పార్టీకే పదవి దక్కలేదు. లోతుగా గమనిస్తే.. ఎన్డీయేలో కేంద్రమంత్రి పదవిలేని పార్టీ జనసేన ఒక్కటే!

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. వల్లభనేని బాలశౌరికి కేంద్రమంత్రి పదవి దక్కకుండా పవన్ కల్యాణే అడ్డు పడినట్టు సమాచారం. సోదరుడు నాగబాబును రాజ్యసభ ఎంపీగా పంపాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారని, ఆయన రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత.. అప్పుడు ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాల్సిందిగా మోదీని కోరుతారని కూడా తెలుస్తోంది.